Begin typing your search above and press return to search.

మౌన సింగ్ బాబుకు కాంప్లిమెంట్

By:  Tupaki Desk   |   20 Nov 2016 6:03 AM GMT
మౌన సింగ్ బాబుకు కాంప్లిమెంట్
X
ఎంత కష్టపడుతున్నా తనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రావటం లేదన్న బాధ.. ఆవేదన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో తరచూ వినిపిస్తుంటుంది. రోజుకు 18 గంటలు పని చేస్తున్నా.. తాను కోరుకున్న రీతిలో పనులు జరగటం లేదన్న అసంతృప్తిని ఆయన వ్యక్తం చేస్తుంటారు. ఇదొక బాధ అయితే.. కేంద్రంలో తాను చక్రం తిప్పాలన్న ఆశపై మోడీ నీళ్లు పోయటంపై కూడా చంద్రబాబు లోలోన బాధ ఉన్నా.. దాన్ని కవర్ చేసుకోవటం కనిపిస్తుంది.

కేంద్రంలో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నా.. మోడీ జమానాలో తనకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కటం లేదన్న వేదనతో పాటు.. తన సమర్థతను తొక్కి పెడతున్నట్లుగా బాబు ఆవేదన ఉందన్న విషయం ఆయన పార్టీకి చెందిన నేతలు ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వేళ.. బాబు మురిసిపోయేలా.. ఆయన శక్తిసామర్థ్యాలు ఏమిటన్న విషయం ప్రపంచానికి అర్థమయ్యేలా ఒక కీలక వ్యాఖ్య.. అతి ముఖ్యుడి నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారింది.

మౌన సింగ్ గా.. మౌన ప్రధానిగా పేమస్ అయి.. పదవిలో ఉన్నా లేకున్నా అతి తక్కువగా మాట్లాడే అలవాటున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చగా మారాయి. తాజాగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శత జయంతి వేడుకలు శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్.. బీజేపీ సీనియర్ నేతలు.. ఎంపీలు.. మాజీ ఎంపీలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్మోహన్ కు కాస్త దగ్గరగా ఉండే మాజీ ఎంపీ ఒకరు ఆయ‌న‌తో కాసేపు మాట్లాడారు.

ఈ సందర్భంగా విభజన తర్వాత ఏపీ పరిస్థితి ఎలా ఉంది? వ్యవస్థ గాడిలో పడిందా? ఆర్థిక రంగం ఎలా ఉంది? అన్న ప్రశ్నలతో పాటు.. మీకేం.. మీకు చంద్రబాబు ఉన్నాడుగా.. కష్టపడి ఏదోలా ఆయనే అభివృద్ధి చేస్తారులే అన్న భరోసా మాట మన్మోహన్ సింగ్ నోటి నుంచి రావటం సదరు మాజీ ఎంపీకి ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పక తప్పదు. అతి తక్కువగా మట్లాడే మన్మోహన్ సింగ్ కు.. బాబు మీద ఎంత నమ్మకం ఉందన్న విషయానికి ఈ ఉదంతం నిదర్శనమని.. ఆయన సమర్థత మీద అందరికి నమ్మకం ఉందన్న విషయాన్ని మరోసారి నిరూపితమైనట్లుగా సదరు మాజీ ఎంపీ వ్యాఖ్యానించటం గమనార్హం.

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మన్మోహన్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ కావటంతో.. ఆ రాష్ట్రానికి ఎలాంటి ఢోకా లేదని.. ఏపీకి మాత్రం కాస్త ఇబ్బంది తప్పదని.. త్వరలోనే పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్న మాట మన్మోహన్ చెప్పినట్లుగా చెబుతున్నారు. తన పాత స్నేహితులు కలిసిన సమయంలో మ‌న్మోహ‌న్ సింగ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మన్మోహన్ సింగ్‌ నోటి నుంచి వచ్చిన ఈ మాటలు ఏపీ ముఖ్యమంత్రికి ఫుల్ హ్యాపీని ఇస్తాయనటంలో మరో సందేహం లేదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/