Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడు కోటాలో ఎంపీ కానున్న మ‌న్మోహ‌న్‌

By:  Tupaki Desk   |   26 May 2019 8:08 AM GMT
త‌మిళ‌నాడు కోటాలో ఎంపీ కానున్న మ‌న్మోహ‌న్‌
X
మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు ఎంపిక కానున్నారు. అసోం నుంచి ఎన్నికైన ఆయ‌న ప‌ద‌వీకాలం త్వ‌ర‌లో తీర‌నుంది. దీంతో.. ఆయ‌న్ను మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు పంపేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు షురూ చేసింది. ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు పెద్ద‌గా సీట్లు రాని నేప‌థ్యంలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది.

ఇదిలా ఉంటే.. మ‌న్మోహ‌న్ ను మ‌రోసారి రాజ్య‌స‌భకు పంప‌టానికి కాంగ్రెస్ ఈసారి మిత్రుడి సాయం తీసుకుంటోంది. త‌మిళ‌నాడులో త‌న మిత్ర‌ప‌క్ష‌మైన డీఎంకే బ‌లంతో మ‌న్మోహ‌న్ ను రాజ్య‌స‌భ‌కు పంపే ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేసింది. దీనికి డీఎంకే సైతం ఓకే అన‌టంతో మ‌న్మోహ‌న్ మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కావ‌టం నామ‌మాత్రంగా మారింది.

తాజాగా ప‌ద‌వీకాలం ముగిసే ఆరుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల్లో ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఉన్న క‌నిమొళి లోక్ స‌భ ఎన్నికల్లో విజ‌యం సాధించారు. దీంతో ఆమె స్థానాన్ని మ‌న్మోహ‌న్ కు కేటాయించ‌నున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన త‌మిళ‌నాడుఅసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున డీఎంకే విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 22 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ్గా 19 స్థానాల్లో డీఎంకే గెలిచింది. దీంతో.. త‌మిళ‌నాడు అసెంబ్లీలో ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న డీఎంకే బ‌లం 88 నుంచి 101కు పెరిగిన‌ట్లైంది.

మ‌రోవైపు లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ డీఎంకే పెద్ద ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుంది. త‌మిళ‌నాడులో మొత్తం 39 లోక్ స‌భ స్థానాలు ఉంటే 31 స్థానాల్లో డీఎంకే అభ్య‌ర్థులు గెలుపొందారు. తాజాగా ఖాళీ అవుతున్న రాజ్య‌స‌భ స‌భ్యుల్ని ఎంపిక చేసుకునేందుకు డీఎంకేకు మూడు స్థానాలు.. అన్నాడీఎంకే మూడు స్థానాల్ని గెలుచుకునే అవ‌కాశం ఉంది. దీంతో డీఎంకే త‌ర‌ఫున ఎండీఎంకే నేత వైగోను రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. మ‌రో స్థానంలో మ‌న్మోహ‌న్ ను ఎంపిక చేయ‌నున్నారు. మిగిలిన ఒక్క స్థానంలో డీఎంకేకు చెందిన ఒక‌రిని ఎంపిక చేయ‌నున్నారు.