Begin typing your search above and press return to search.

మళ్లీ పాఠాలు చెప్పబోతున్న మన్మోహన్ సింగ్

By:  Tupaki Desk   |   7 April 2016 11:04 AM GMT
మళ్లీ పాఠాలు చెప్పబోతున్న మన్మోహన్ సింగ్
X
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మళ్లీ పాఠాలు చెప్పుకోవడానికి రెడీ అవుతున్నారట. 50 ఏళ్ల కిందట చివరిసారిగా పంజాబ్ యూనివర్సిటీలో పాఠం చెప్పిన ఆయన మళ్లీ ఇప్పుడు అదే యూనివర్సిటీలో పాఠాలు చెప్పడానికి రెడీ అువుతున్నారు. పంజాబ్ యూనివర్సిటీలో లాజిస్టిక్సు సబ్జెక్టు బోధించడానికి మన్మోహన్ ఓకే చెప్పారట. అయితే... ఆయన చంఢీగడ్ వచ్చినప్పుడంతా ఇలా యూనివర్సిటీకి వచ్చి ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటారు. ఒకవేళ అలా కుదరని పక్షంలో వీడియో కాన్ఫరెన్సులో పాఠాలు చెబుతారు.

కాగా మన్మోహన్ పంజాబ్ యూనివర్సిటీలో 1954లో మాస్టర్సు డిగ్రీ పూర్తిచేశారు. ఆ తరువాత మూడేళ్లలోనే 1957లో అక్కడే ఎకనమిక్సు లెక్చరర్ గా చేరారు. 1966లో ఆ ఉద్యోగానికి గుడ్ బాయ్ చెప్పేసి న్యూయార్కులో యూఎన్వో సెక్రటేరియట్ ఆర్థిక వ్యవహారాల అధికారిగా నియమితులయ్యారు. అనంతరం అనేక పదవులు చేపడుతూ భారత ఆర్థిక మంత్రి, భారత ప్రధానిగానూ పనిచేశారు. ప్రధానిగా ఆయన సామర్థ్యంపై ఎన్ని విమర్శలున్నా కూడా ఆర్థిక మంత్రిగా ఆయనకు మంచి పేరుంది. మెతక మనిషి కావడంతో ప్రధానిగా ఉన్నా సోనియాగాంధీ పాలన సాగిందన్న విమర్శలున్నాయి. అయితే.... ఎన్ని విమర్శలున్నా కూడా వ్యక్తిగా, మేధావిగా ఆయన్ను కాంగ్రెస్సే కాదు, బీజేపీ వంటి ఇతర పార్టీల సీనియర్ నేతలు కూడా గౌరవిస్తారు. అంతటి స్థాయి ఉన్న మన్మోహన్ చెప్పే పాఠాలు వినడం పంజాబ్ వర్సిటీ విద్యార్థుల అదృష్టమనే చెప్పాలి.