Begin typing your search above and press return to search.

ప్రణబ్ దాదాకు సోనియానే అడ్డం పడ్డారా?

By:  Tupaki Desk   |   14 Oct 2017 4:54 AM GMT
ప్రణబ్ దాదాకు సోనియానే అడ్డం పడ్డారా?
X
చరిత్రలోని సత్యాలు దాచేస్తే దాగేవి కాదు. ఏదో ఒకనాటికి అవి బయటకు వచ్చి తీరుతాయి. చేదు వాస్తవాల మాదిరిగానో, ఛలోక్తుల్లాగానో ఏదో ఒక రకంగా.. వాస్తవాలు మాత్రం బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. 2004లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత.. ప్రధాని పదవి చేపట్టడానికి సోనియా అనర్హురాలంటూ అప్పట్లో పెద్ద వివాదాలే రేగాయి. దాంతో ఆమె వెనక్కు తగ్గడంతో మన్మోహన్ ప్రధాని అయ్యారు. అప్పటికి కాంగ్రెస్ లో ప్రణబ్ ముఖర్జీ వంటి అనుభవజ్ఞుడు , మెరికల్లాంటి నాయకులు ఉండగా... ప్రధాని వంటి కీలక బాధ్యతలను మన్మోహన్ వంటి మెతక నాయకుడి చేతిలో పెట్టారు సోనియా. దాని ఫలితం.. పదేళ్ల పాలన ఎలా సాగిందో.. నిర్ణయాత్మకంగా ఉండలేని ప్రధానిగా మన్మోహన్ ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు.

తాజాగా ప్రణబ్ ముఖర్జీ తన జీవిత కథను భాగాలుగా విడుదల చేస్తున్న సమయంలో చాలా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తన మూడోభాగం జీవితకథ ‘కొలిషన్ ఇయర్స్’ లో ప్రణబ్.. 2004లో సోనియా నిరాకరించాక తానే ప్రధాని అవుతానని అంతా అనుకున్నారని, అనూహ్యంగా మన్మోహన్ అయ్యారని రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మన్మోహన్ మాట్లాడుతూ.. నిజానికి తనకంటె ప్రధాని పదవికి అన్ని రకాలుగా ప్రణబ్ అర్హుడని, ఆ సమయంలో ఆయన బాధపడి ఉన్నా, అది సబబేనని వ్యాఖ్యానించారు. ప్రణబ్ ప్రధాని కావాల్సింది.. అన్ని అర్హతలూ ఆయనకే ఉన్నాయి.. అయితే నేను ప్రధాని కావడంలో నా ప్రమేయం ఏమీ లేదని ఆయనకు తెలుసు.. అంటూ మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. మరో రకంగా చెప్పాలంటే.. ప్రధాని కావడంలోనే కాదు.. పరిపాలనలో కూడా మన్మోహన్ ప్రమేయం ఏమీ లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మన్మోహన్ ప్రసంగ సమయంలో సోనియా రాహుల్ సహా అంతా దీన్ని ఛలోక్తిలాగా తీసుకుని నవ్వుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ విషయం మీద లోతుగా చర్చ జరుగుతోంది. 2004లో విజయం దక్కిన ఆ కీలక సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ వంటి సమర్థుడైన నాయకుడిని ప్రధాని చేసి ఉంటే.. తన మాటకు జై కొట్టే పరిస్థితి ఉండదని సోనియా అలా చేసి ఉంటుందని అనుకుంటున్నారు. ప్రణబ్ తిరుగులేని నేత, ఆయన ఆ పదవిలో పాతుకుపోతే.. ప్రభుత్వం మీదనే కాకుండా, పార్టీ మీద కూడా తన పట్టు సడలుతుందనే భయంతోనే బహుశా సోనియా.. మన్మోహన్ వంటి మెతక స్వభావిని ఎంచుకుని ఉంటారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. కేంద్రంలో పదేళ్ల పదవీ కాలం దక్కినా అలాంటి నిష్క్రియా పరుడైన ప్రధానిని, చురుగ్గా ఉండని ప్రధానిని ఈ దేశానికి అందించినందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటూ ఉంటున్నదని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.