Begin typing your search above and press return to search.

మాజీ ప్రధాని పోటీ.. అమృత్ సర్ నుంచే..?

By:  Tupaki Desk   |   12 March 2019 7:46 AM GMT
మాజీ ప్రధాని పోటీ.. అమృత్ సర్ నుంచే..?
X
దేశంలోనే నిశ్శబ్ధ ప్రధానిగా పేరుపొందారు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల వేళ ఆయన పోటీచేస్తారా.? లేదా అన్న ఆసక్తి నెలకొంది.. కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి లోక్ సభ కు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను పోటీచేయించాలని యోచిస్తోంది. అయితే మన్మోహన్ మాత్రం తన ఆరోగ్యం బలహీనంగా ఉందని.. అంతేకాకుండా గుండెకు బైపాస్ సర్జరీ చేసుకున్నందు వల్ల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి.. ప్రచారం చేసేంత శక్తి లేదని కాంగ్రెస్ అధిష్టానానికి తన అసహాయతను వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుత క్లిష్ట పోటీ రాజకీయ వాతావరణంలో తాను ఇమడలేనని.. భరించలేనని చెప్పినట్లు సమాచారం.

అయితే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాత్రం మాజీ ప్రధానిని బరిలో ఉంచాల్సిందేనని పట్టుబట్టినట్లు సమాచారం. ఇందుకోసం స్వయంగా అమరీందర్ సింగ్.. మన్మోహన్ సింగ్ ను కలుసుకొని మీ ప్రచార బాధ్యత తాను తీసుకుంటానని.. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో ఉండి మిమ్మల్ని గెలిపిస్తానని నచ్చచెప్పినట్లు సమాచారం. దీంతో సరేనన్న మన్మోహన్ ఈసారి అమృత్ సర్ బరిలో నిలిచేందుకు అంగీకరించినట్లు సమాచారం.

మన్మోహన్ సింగ్ భారత ప్రధానమంత్రిగా రెండు సార్లు ఎన్నికైనా కూడా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఒకసారి న్యూఢిల్లీ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయాడు. అందుకే అప్పటి నుంచి రాజ్యసభ ఎంపీగానే కాంగ్రెస్ మద్దతుతో నామినేట్ అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం అస్సాం రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా మన్మోహన్ ఉన్నారు. ఈసారి అమృత్ సర్ నుంచి మన్మోహన్ బరిలో దిగితే రెండోసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటారు.