Begin typing your search above and press return to search.

మౌన సింగ్ ప్ర‌త్యేకంపై మాట్లాడ‌నున్నారా?

By:  Tupaki Desk   |   7 May 2015 9:10 AM GMT
మౌన సింగ్ ప్ర‌త్యేకంపై మాట్లాడ‌నున్నారా?
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్.. కోలుకోవ‌టానికి.. త‌న పూర్వ వైభ‌వం సంత‌రించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. త‌న‌కు అత్యంత ప‌ట్టున్న తెలుగు రాజ‌కీయాల్లో పెద్దఎత్తున దెబ్బ తిన్న ఆ పార్టీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ జ‌వ‌స‌త్వాలు కూడ‌గ‌ట్టుకునేందుకు కృషి చేస్తోంది.
ఓ ప‌క్క కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త్వ‌ర‌లో.. తెలంగాణ‌లో పాద‌యాత్ర చేయ‌నున్న విష‌యం తెలిసిందే.ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న రైతుల‌కు భ‌రోసా ఇవ్వ‌టానికి.. వారికి ధైర్యం చెప్ప‌టంతోపాటు.. తామున్నామ‌న్న ధీమా క‌ల్పిచేందుకు అదిలాబాద్ జిల్లాలో 15 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేయాల‌ని భావించ‌టం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంపై రాహుల్ దృష్టి పెడుతున్న స‌మ‌యంలోనే.. ఏపీపైన కాంగ్రెస్ దృష్టి సారిస్తోంది. విభ‌జ‌న కార‌ణంగా సీమాంధ్ర‌లో పార్టీకి జ‌రిగిన డ్యామేజీని వీలైనంత‌గా త‌గ్గించుకునే దిశ‌గా పావులు క‌దుపుతోంది.
విభ‌జ‌న సంద‌ర్భంగా.. నాటి ప్ర‌ధాని హోదాలో మ‌న్మోహ‌న్ సింగ్ చేత ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని రాజ్య‌స‌భ‌లో హామీ ఇవ్వ‌టం తెలిసిందే. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన మోడీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విష‌యంలో సుముఖ‌త చూప‌క‌పోవ‌టంతో ఆ అవ‌కాశాన్ని తాము చేజిక్కించుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా.. మ‌న్మోహ‌న్ సింగ్ చేత‌.. శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న చేయించాల‌ని భావిస్తోంది.


విభ‌జ‌న చ‌ట్టంలోని అడ్డంకుల కార‌ణంగా తాము ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని న‌మ్మ‌బలుకుతున్న కేంద్ర‌మంత్రుల మాట‌కు కౌంట‌ర్ ఇచ్చేలా మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని చెబుతున్నారు. ప్ర‌ధాని హోదాలో తాను ఏపీకి ఇచ్చిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏన్డీయే స‌ర్కారు ఏం చేస్తుంద‌న్న ప్ర‌శ్న‌ను సంధించేలా చేయాల‌ని కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ప్లాన్ చేస్తుంద‌ని చెబుతున్నారు.
ఒక‌వేళ అదే నిజ‌మైతే.. మోడీ స‌ర్కారుకు ఇబ్బంది ఎదురైన‌ట్లే. ఇంత‌కాలం ఏపీకి ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో మోడీ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రిని పెద్ద‌గా ప్ర‌శ్నించే వారు లేరు. మిత్ర‌త్వం కార‌ణంగా ఏపీ అధికార‌ప‌క్షం ప్ర‌త్యేకంపై నోరు మెద‌ప‌ని ప‌రిస్థితి. మ‌రోవైపు.. కేసుల చిక్కుల‌తో విప‌క్ష నేత సైతం ప్ర‌త్యేకంగా మాట మాట్లాడ‌ని దుస్థితి. ఇదిలా ఉంటే.. ఏపీ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌త్యేక‌హోదా గురించి మాట్లాడినా వారి మాట‌ల్ని సీమాంధ్రులు న‌మ్మ‌లేని నేప‌థ్యంలో.. వారి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని భావించిన కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం మాజీ ప్ర‌ధాని.. విశ్వ‌స‌నీయ‌త ఉన్న రాజ‌కీయ నేత‌గా పేరున్న మ‌న్మోహ‌న్ ను రంగంలోకి దించాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి.. మౌన‌సింగ్‌నోట ఉంచి ప్ర‌త్యేకం మాట ఎంత బ‌లంగా వ‌స్తుందో చూడాలి