Begin typing your search above and press return to search.

ఆ మాట అన్నందుకు రేవంత్ మీద కేసు

By:  Tupaki Desk   |   26 Jun 2016 9:56 AM GMT
ఆ మాట అన్నందుకు రేవంత్ మీద కేసు
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాటలు ఎంత ఘాటుగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు ఆయన భాష మరింత పదును పెరగటంతో పాటు.. కొన్ని సందర్భాల్లో అభ్యంతరకర వ్యాఖ్యల్న అలవోకగా చేసేస్తుంటారు. దూకుడు రాజకీయాల నేపథ్యంలో ఒకరిని ఒకరు మాట అనుకోవటం మామూలుగా మారిన రోజుల్లో.. ఎవరి మాటల్ని సీరియస్ గా తీసుకోవాలి? ఎవరి మాటల్ని లైట్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారటమే కాదు.. ఆయనపై కేసు నమోదు చేసేలా చేశాయి. మల్లన్నసాగర్ నిర్వాసితుల కు సంఘీభావంగా నిరసన దీక్ష చేస్తున్న రేవంత్ రెడ్డి.. నిరసన దీక్ష శిబిరంలోప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఆరోపణ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన తీరుపై టీఆర్ ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా అన్నారంటూ టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల కోసం.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన టేపుల్ని పరిశీలిస్తున్నమని.. న్యాయ నిపుణుల సలహాలు.. సూచనలు తీసుకొని ఈ కేసు వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని పోలీసుల వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ పై రేవంత్ చేసిన విమర్శలపై ఈసారి చట్టం కాస్త కఠినంగా వ్యవహరిస్తుందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపించటం గమనార్హం.