Begin typing your search above and press return to search.

సీఎంను వేధిస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   15 March 2017 10:20 AM GMT
సీఎంను వేధిస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలు
X
గోవా ముఖ్య‌మంత్రిగా మంగ‌ళ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. నిన్న సాయంత్రం పారిక‌ర్‌తో పాటు మ‌రో 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. గ‌త రెండున్న‌ర ఏళ్లుగా త‌మ పార్టీలో మంత్రులుగా ప‌నిచేసిన‌వాళ్లు ఓడిపోయార‌ని, వాళ్లు ఎందుకు అలా ఓట‌మి పాల‌య్యారో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఆ అంశంపై ప‌రిశీలన మొద‌లుపెట్టిన‌ట్లు పారిక‌ర్ తెలిపారు. గోవా ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం మ‌నోహ‌ర్ పారిక‌ర్ మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

గోవాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వ‌ర‌లోనే బీజేపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. త‌మ నేత‌ల తీరుతో విసిగిపోయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. బీజేపీలో చేర‌తామ‌ని త‌న‌కు సందేశాలు పంపిస్తున్న‌ట్లు పారిక‌ర్ వెల్ల‌డించారు. 'వాళ్లు నాకు మెసేజ్‌ లు పంప‌కుండా ఆప‌లేను. దీనిపై నాకు ఆస‌క్తి లేదు. అయినా వాళ్లు కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి బీజేపీలో చేర‌తామంటే నేను ఆప‌లేను. ఇప్ప‌టికీ వాళ్ల‌లో వాళ్లే గొడ‌వ ప‌డుతున్నారు. సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో కూడా తేల్చుకోలేక‌పోయారు' అని ఎద్దేవా చేశారు.

ఇత‌ర పార్టీల నుంచి ఎమ్మెల్యేల‌ను ఆక‌ర్షించ‌డానికి డ‌బ్బు వెద‌జ‌ల్లార‌న్న ఆరోప‌ణ‌ల‌ను పారిక‌ర్ ఖండించారు. 'ఎప్పుడూ డ‌బ్బుతోనే వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టే వారు డ‌బ్బు గురించే మాట్లాడుతారు. నేనెప్పుడూ డ‌బ్బుకు చాలా దూరం. ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా కూడా నా హ‌యాంలో ఏజెంట్స్, లంచాలు లేవు' అని పారిక‌ర్ అన్నారు. 'కాంగ్రెస్‌ లో రాజీనామాల‌పై వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ నా నైతికతే వారిని బీజేపీలోకి రాకుండా అడ్డుకుంది. వారి నేత‌ల తీరుపై వాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు'అని పారిక‌ర్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/