Begin typing your search above and press return to search.

మీడియాను ‘సరదా’తో ఏసుకున్న పారికర్

By:  Tupaki Desk   |   10 July 2016 5:18 AM GMT
మీడియాను ‘సరదా’తో ఏసుకున్న పారికర్
X
దేశంలో మీడియా జోరు పెరిగిన తర్వాత రాజకీయ నాయకులు అనునిత్యం అలెర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము మాట్లాడే ప్రతి మాటలోని ప్రతి పదాన్ని భూతద్దం వేసుకొని మరీ చూస్తున్న తీరు వారిని ఎంతగా ఇబ్బందిపెడుతుందన్న విషయాన్ని తాజాగా కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. గోవా ఇంజనీరింగ్ కాలేజ్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన పారికర్ మీడియా మీద చురుకులు వేశారు.

ముఖ్యంగా ఢిల్లీ మీడియాను ఆయన ప్రత్యేకంగా ఏసుకున్నారు. సరదాగా మాట్లాడటం.. జోక్స్ వేస్తూ మాట్లాడాలంటే తనకు భయం వేస్తుందన్న ఆయన.. ఏ మాటను ఎలా వక్రీకరిస్తారోనని భయం తనకు కలుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. తాను పుట్టి పెరిగిన గోవాలో తనకు అలాంటి భయాలు లేవన్న ఆయన.. ఢిల్లీలో ఏం మాట్లాడినా గందరగోళం సృష్టిస్తారంటూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ఈ సందర్భంగా గతంలో ప్రధాని మోడీ చెప్పిన మాటను పారికర్ ప్రస్తావించారు. 24 గంటల వార్తా ఛానళ్లు వచ్చిన తర్వాత మనం మాట్లాడే ప్రతి మాటలోని పదాన్ని పట్టుకొని వివాదాస్పదం చేస్తున్నారని.. ప్రజల జీవితంలో హాస్యం తగ్గిపోవటానికి ఇదో కారణంగా మారిందన్న మోడీ మాటను గుర్తు చేశారు. అంతేకాదు.. గతంలో తాను సరదాగా జోకులు చెబుతూ మాట్లాడేవాడినని.. ధారాళంగా ప్రసంగాలు చేస్తుండేవాడినని.. అవేవీ వివాదాస్పదం కాలేదన్న మోడీ మాటను పారికర్ చెబుతూ.. ఢిల్లీ మీడియా తీరును తనదైన స్టైల్లో ఏసుకున్నారు.