Begin typing your search above and press return to search.

ఆ సీఎంకు అమెరికాలో అత్య‌వ‌స‌ర వైద్యం!

By:  Tupaki Desk   |   7 March 2018 4:41 AM GMT
ఆ సీఎంకు అమెరికాలో అత్య‌వ‌స‌ర వైద్యం!
X
మొన్న‌టి వ‌ర‌కూ హుషారుగా ఉంటూ.. చురుగ్గా వ్య‌వ‌హ‌రించిన సీఎం ఈ మ‌ధ్య‌నే అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. సాధార‌ణ ఆరోగ్య స‌మ‌స్య‌లే త‌ప్పంచి న‌థింగ్ సీరియ‌స్ అంటూ వైద్యుల వివ‌ర‌ణ‌ల‌తో వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే.. ఆయ‌న ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదంటూ సోష‌ల్ మీడియాలో ఆ సీఎం ఆరోగ్యంపై వైర‌ల్ వార్త‌లు వ‌చ్చాయి. అవ‌న్నీ త‌ప్ప‌ని కొట్టి పారేశారు అధికారులు. కానీ.. ఇప్పుడా వార్త‌లు నిజం కావ‌ట‌మే కాదు.. ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు అత్య‌వ‌స‌ర వైద్యం కోసం అమెరికాకు వెళ్లాల‌ని నిర్ణ‌యించ‌టం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఇంత‌కీ ఆ సీఎం ఎవ‌రు? ఆయ‌న ఎదుర్కొంటున్న ఆరోగ్య స‌మ‌స్య ఏమిటి? అన్న‌ది చూస్తే.. నిజాయితీకి నిలువెత్తు రూపంగా చెప్పే గోవా రాష్ట్ర సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో క్లీన్ చిట్ ఇచ్చే సీఎంల‌లో ఒక‌రిగా మ‌నోహ‌ర్ పారిక‌ర్ ను అభివ‌ర్ణిస్తారు. ఏరి.. కోరి మ‌రీ ఢిల్లీకి పిలిచి కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి బాధ్య‌త‌ల్ని మ‌నోహ‌ర్ పారిక‌ర్ కు అప్ప‌గించ‌టం తెలిసిందే. గోవాలో నెల‌కొన్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న్ను తిరిగి గోవాకు పంపించాల్సి వ‌చ్చింది.

ఇటీవ‌ల ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్నారు. స్వ‌ల్ప కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు. హైఫీవ‌ర్ రావ‌టంతో ఆయ‌న ఇటీవ‌ల రెండుసార్లు ముంబ‌యిలో మెడిక‌ల్ చెక‌ప్ చేయించుకున్నారు. లీలావ‌తి ఆసుప‌త్రి లో ఆడ్మిట్ అయ్యారు. ఇదే స‌మ‌యంలో వేరే కార్య‌క్ర‌మంలోపాల్గొన‌టానికి ముంబ‌యి వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేకంగా లీలావ‌తి ఆసుప‌త్రికి వెళ్లి పారిక‌ర్ ను పరామ‌ర్శించ‌టంతో ఆయ‌న అనారోగ్యంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే.. పారిక‌ర్ ఆరోగ్యంపై వ‌స్తున్న వార్త‌ల్లోనిజం లేద‌ని కొట్టిపారేశారు. ఆయ‌న త్వ‌ర‌లోనే రిక‌వ‌రీ అవుతార‌ని చెప్ప‌టం జ‌రిగింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌న‌కు అత్య‌వ‌స‌ర చికిత్స కోసం అమెరికాకు వెళుతున్న‌ట్లుగా గోవా గ‌వ‌ర్న‌ర్ మృదుల సిన్హా కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు ఆయ‌న అమెరికాకు వెళుతున్న‌ట్లుగా వెల్ల‌డైంది. గ‌వ‌ర్న‌ర్ కు సీఎం లేఖ రాయ‌టం..దానికి స్పంద‌న‌గా గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌టంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మ‌రోవైపు గోవా ముఖ్య‌మంత్రి పారిక‌ర్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియోను విడుద‌ల చేశారు. త‌న‌కు మెడిక‌ల్ లీవును కోరిన ఆయ‌న‌.. త‌న ఆరోగ్యం మెరుగు అవ్వాల‌ని కోరుతూ ప్రార్థ‌న‌లు చేస్తున్న వారికి థ్యాంక్స్ చెప్పారు. సింఫుల్ గా ఉండ‌టంతో పాటు.. ప్ర‌జ‌ల‌తో స్నేహంగా ఉండ‌టం.. అంద‌రితో క‌లుపుగోలుగా వ్య‌వ‌హ‌రించే పారిక‌ర్ లాంటి నేత ఆరోగ్యం త్వ‌ర‌గా మెరుగుప‌డాల‌ని ఆశిద్దాం. అలాంటి నేత‌ల అవ‌స‌రం దేశానికి ఎంతో ఉంది.