Begin typing your search above and press return to search.

గోవా సీఎం పారిక‌ర్ ఇక లేరు!

By:  Tupaki Desk   |   17 March 2019 3:45 PM GMT
గోవా సీఎం పారిక‌ర్ ఇక లేరు!
X
గోవా లాంటి ఒక బుల్లి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉండే నేత మ‌ర‌ణిస్తే.. యావ‌త్ దేశం శోకంలో మునిగిపోతుందా? అంటే లేదంతే. కానీ.. ఆ ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ అయితే మాత్రం క‌చ్ఛితంగా రోదిస్తుంది. నిజాయితీకి నిలువెత్తు రూపంలా.. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో క‌డిగిన ముత్యంలా.. స‌గ‌టు సామాన్యుడిగా వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తి ముఖ్య‌మంత్రి అయితే అంత‌కు మించిన గొప్ప అంశం ఏముంది?

స‌ర్పంచ్ గా త‌న ప‌ద‌వీ కాలంలో కోట్లాది రూపాయిల్ని వెన‌కేసుకుంటున్న నేత‌ల‌కు భిన్నంగా.. ముఖ్య‌మంత్రి హోదాలో ఉండి కూడా.. ఏదైనా వేడుక‌కు హాజ‌రైన‌ప్పుడు త‌న గ‌న్ మెన్ల‌ను బ‌య‌టే వ‌దిలేసి.. సాదాసీదా వ్య‌క్తిగా.. అంద‌రితో పాటు స‌మానమ‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తూ.. క‌లిసిపోయే నేత పారిక‌ర్. ఒక చిన్న రాష్ట్రానికి చెందిన నేత‌గా ఉన్న‌ప్పుడు.. ముఖ్య‌మంత్రిగా గోవాకు ఎన్నికైన వేళ యావ‌త్ దేశానికి ఆయ‌న గురించి.. ఆయ‌న గొప్ప‌త‌నం గురించి తెలిసింది.

పార్టీల‌కు అతీతంగా అభిమానించి.. ఆరాధించే వ్య‌క్తిత్వం పారిక‌ర్ ది. అలాంటి ఆయ‌న కొద్ది నెల‌లుగా తీవ్ర అనారోగ్యానికి గురైన సంగ‌తి తెలిసిందే. పాంక్రియాటిక్ కేన్స‌ర్ తో బాధ ప‌డుతున్న ఆయ‌న‌.. కొంత‌కాలం విదేశాల్లో చికిత్స పొందారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డ‌లేదు.

ఈ రోజు సాయంత్రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని.. ఆయ‌న్ను మామూలు స్థితికి తెచ్చేందుకు వైద్యులు తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ట్లుగా గోవా సీఎంవో ట్వీట్ చేసింది. ఇలాంటి ట్వీట్ అప‌శ‌కునంగా వినిపించినా.. అలాంటి మంచి మ‌నిషికి ఏమీ కాదులే అన్న ఆశ‌తో ఉన్న‌ప్ప‌టికీ.. దేవుడు మ‌హా దుర్మార్గుడు భ‌య్.. మంచోళ్ల‌ను తొంద‌ర‌గా తీసుకుపోతాడ‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే పారిక‌ర్ ను త‌న వ‌ద్ద‌కు తీసుకెళ్లిపోయారు.

63 ఏళ్ల పారిక‌ర్ గోవాకు మూడు సార్లు ముఖ్య‌మంత్రి కావ‌ట‌మే కాదు. ర‌క్ష‌ణ మంత్రిగా సేవ‌లు అందించారు. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న పారిక‌ర్ ఢిల్లీలోని ఎయిమ్స్.. గోవా.. ముంబ‌యిలోనూ చికిత్స తీసుకున్నారు. సుదీర్ఘ కాలం అమెరికాలో చికిత్స తీసుకున్నా ఆయ‌న ఆరోగ్యం కుదుట ప‌డ‌లేదు. 1955 డిసెంబ‌రు 13న గోవాలో జ‌న్మించిన ఆయ‌న ఐఐటీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు.

సంఘ్ ప‌రివార్ నుంచి బీజేపీకి వ‌చ్చిన నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. 1994లో గోవా అసెంబ్లీకి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 1999లో గోవా అసెంబ్లీకి విప‌క్ష నేత‌గా ఉన్న ఆయ‌న‌.. 2000లో తొలిసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు. అనంత‌రం ప్ర‌ధాని మంత్రివ‌ర్గంలో ర‌క్ష‌ణ‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు.

తాజాగా పారిక‌ర్ మృతి ప‌ట్ల రాజ‌కీయ ప‌క్షాలు విచారాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ఆయ‌న ఆనారోగ్యం గురించి అంద‌రికి తెలిసందే అయినా.. ఆయ‌న త‌న ఆరోగ్య స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌తార‌న్న ఆశ అంద‌రిలో ఉంది. కానీ.. విధి మాత్రం కోట్లాది మంది ఆకాంక్ష‌ల్ని కాద‌ని.. పారిక‌ర్ ను త‌న‌తో తీసుకెళ్లిపోయింది. పారిక‌ర్ మృతి ప‌ట్ల రాష్ట్రప‌తి కోవింద్.. ప్ర‌ధాని మోడీతో పాటు బీజేపీకి చెందిన ప‌లువురు నేత‌లు.. ఇత‌ర రాజ‌కీయ ప‌క్ష నేత‌లు త‌మ సంతాపాన్ని తెలియ‌జేశారు.