Begin typing your search above and press return to search.

యూపీ సీఎంగా కేంద్రమంత్రి మనోజ్ సిన్హా?

By:  Tupaki Desk   |   17 March 2017 9:39 AM GMT
యూపీ సీఎంగా కేంద్రమంత్రి మనోజ్ సిన్హా?
X
బీజేపీకి అఖండ విజయాన్ని అందించిన ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న విషయంలో నాలుగు రోజులుగా బీజేపీ అగ్రనాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఆ చర్చలు ముగింపు దశకు వచ్చి పేరు ఖరారు అయిందని తెలుస్తోంది. కేంద్ర మంత్రి మనోజ్ సిన్హాను యూపీ సీఎంగా పంపించాలని నిర్ణయించినట్లుగా ఢిల్లీ వర్గాల సమాచారం.

రాజకీయంగా ఇంకా యువకుడే అయిన మనోజ్ సిన్హా అయితే బాగుంటుందని ప్రధాని మోడీ సహా ఇతర బీజేపీ పెద్దలు డిసైడైనట్లు తెలుస్తోంది. సిన్హా ప్రస్తుతం కమ్యూనికేషన్స్ శాఖ కు స్వతంత్ర హోదా గల సహాయ మంత్రిగా ఉన్నారు. దాంతో పాటు రైల్వేశాఖ సహాయ మంత్రిగానూ ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘాజీ పూర్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన అంతకుముందు కూడా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 57 ఏళ్ల సిన్హా లోక్ సభ సమావేశాలు లేని సమయంలో ఎక్కువగా నియోజకవర్గంలోనే ఉంటుంటారు. అక్కడి ప్రజలను కలుస్తుంటారు.

వ్యవసాయమంటే మక్కువ చూపే సిన్హా ఉన్నత విద్యావంతుడు. ప్రస్తుతం ఐఐటీ వారణాసిగా పిలుస్తున్న బనారస్ హిందూ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజిలో ఆయన ఎంటెక్ చదివారు. 1982 లో 23 ఏళ్ల వయసులోనే బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయిన ఆయన ఇంతవరకు అసెంబ్లీకి ఎన్నడూ పోటీ చేయలేదు. 1998లో బీజేపీ టిక్కెట్ ఇవ్వడంతో ఘాజీపూర్ నుంచి లోక్ సభకు గెలిచారు. మళ్లీ 1999లోనూ గెలిచారు.

సిన్హా అంటే మోడీకి గట్టి నమ్మకం. మిస్టర్ క్లీన్ గా ఆయన్ను అభివర్ణిస్తారు. మొన్నటి యూపీ ఎన్నికల్లో మోడీ తరువాత ఆయనే స్టార్ క్యాంపెయినర్ అని చెబుతారు. ప్రచారం కోసం హెలికాప్టర్ అలాట్ చేసిన కొద్దిమంది స్టార్ క్యాంపెయినర్లలో ఆయన ఒకరు కావడం విశేషం. రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఆయన పనితీరుకు మెచ్చి మోడీ ఆయన్ను కమ్యూనికేషన్ల శాఖకు స్వతంత్ర హోదాతో మంత్రిగా చేశారు. అంతగా మోడీ నమ్మకాన్ని సంపాదించిన ఆయనకే యూపీ పీఠం అప్పగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/