Begin typing your search above and press return to search.

ఆధారాలతో సహా బయటపడుతున్న మాన్సాస్ అక్రమాలు!?

By:  Tupaki Desk   |   16 July 2021 5:41 AM GMT
ఆధారాలతో సహా బయటపడుతున్న మాన్సాస్ అక్రమాలు!?
X
మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన అక్రమాలన్నీ ఇపుడు ఒక్కోటిగా బయటపడుతున్నాయా ? అవుననే సమాధానం వస్తోంది విచారణ జరుపుతున్న కమిటి నివేదికలను చూస్తుంటే. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ జగపతి రాజు ఛైర్మన్ గా ఉన్నపుడు జరిగిన భూ అక్రమాలన్నింటినీ విచారణ కమిటి బయటకు తీస్తోంది. వైసీపీ అధికారంలోకి రాగానే అశోక్ స్ధానంలో ఛైర్ పర్సన్ గా సంచైతా గజపతిరాజును నియమించింది. అయితే ఈ నియామకంపై అశోక్ కోర్టుకెళ్ళి విజయం సాధించారు. ఛైర్మన్ గా మళ్ళీ ఆయనే బాధ్యతలు తీసుకున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సంచైతను ఛైర్ పర్సన్ గా నియమించినప్పటి నుండి వ్యక్తిగతంగా ఆమెపైనే కాకుండా ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిపైన కూడా అశోక్, చంద్రబాబు అండ్ కో నోటికొచ్చినట్లు మాట్లాడారు. మాన్సాస్ ట్రస్టులో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంచైతను అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసేస్తోందని ఆరోపణలు మొదలుపెట్టారు. వేలాది ఎకరాలను దోచేసేకుంటున్నట్లు బురద చల్లేశారు.

దాంతో ట్రస్టు వ్యవహారాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదే సమయంలో కోర్టు ఆదేశాలతో అశోక్ మళ్ళీ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకోవటంతో విచారణలో స్పీడు పెరిగింది. అశోక్ ఛైర్మన్ గా 17 ఏళ్ళుంటే సంచైత ఛైర్ పర్సన్ గా ఉన్నది ఏడాది మాత్రమే. తమ హయాంలో జరిగిన అవకతవకలను, అవినీతి, అక్రమాలన్నింటినీ అశోక్, చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వం ఖాతాలో వేసేశారు. దాంతో ప్రభుత్వానికి ఒళ్ళుమండి మొత్తం వ్యవహారాలపై దర్యాప్తు చేయిస్తోంది.

కమిటి విచారణ మొదలవ్వగానే గడచిన 16 ఏళ్ళుగా ట్రస్టులో అసలు ఆడిటే జరగలేదని బయటపడింది. అశోక్ ఆధ్వర్యంలోనే వేలాది ఎకరాలను టీడీపీ నేతలకు దోచిపెట్టినట్లు ఇపుడు బయటపడుతోంది. నేతలు అబద్ధాలు చెప్పచ్చు కానీ రికార్డుల్లోని తేదీలు అబద్ధాలు చెప్పవు కదా. అశోక్, చంద్రబాబు హయాంలో జరిగిన కంపంతా ఇపుడు తేదీలతో సహా బయటపడుతోంది. నిజానికి సంచైతను నియమించినపుడు కేవలం ఆమెవరకే అశోక్, చంద్రబాబు పోరాటాన్ని పరిమితం చేసుంటే బాగుండేది. కానీ అనవసరంగా జగన్ను కూడా పిక్చర్లోకి లాగారు.

తమ హయాంలోనే అవినీతి, అక్రమాలు, భూదోపిడి జరిగినపుడు జగన్ పై బురదచల్లకుండా ఉంటే సరిపోయేది. అలాకాకుండా కావాలనే జగన్ను రెచ్చగొట్టడంతో ఇపుడు టీడీపీ ప్రముఖులు చాలామంది తగులుకుంటున్నారు. సింహాచలం దేవాలయానికి చెందిన రు. 10 వేల కోట్ల విలువైన 748 ఎకారల భూమి టీడీపీ హయాంలోనే రికార్డుల నుండి మాయమైపోయినట్లు నిర్ధారణైంది. అలాగే మాన్సాస్ ట్రస్టు భూములను కూడా టీడీపీ నేతలు ఎలా సొంతం చేసుకున్నారో రికార్డుల్లో అర్ధమైపోతోంది. తొందరలోనే విచారణ కమిటి తన నివేదికను ప్రభుత్వానికి అందిచేందుకు రంగం సిద్ధమైంది. తర్వాత ఏమవుతుందో చూడాల్సిందే.