Begin typing your search above and press return to search.

సంచ‌యిత‌ - అశోక గ‌జ‌ప‌తి.. అస‌లు పంచాయితీ ఇదే

By:  Tupaki Desk   |   15 Jun 2021 11:30 AM GMT
సంచ‌యిత‌ - అశోక గ‌జ‌ప‌తి.. అస‌లు పంచాయితీ ఇదే
X
మాన్సాస్‌-సింహాచ‌లం ట్ర‌స్టు చైర్మ‌న్ వివాదం ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్ర‌స్టు చైర్మ‌న్ ను మారుస్తూ గతేడాది రాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న అశోక గ‌జ‌ప‌తి రాజును దింపేసి ఆనంద గ‌జ‌ప‌తి రాజు కూతురు సంచ‌యిత‌ను నియ‌మించింది. దీంతో.. ఈ పంచాయితీ కోర్టుకు ఎక్కింది. విచారించిన న్యాయ‌స్థానం.. స‌ర్కారు జీవోను కొట్టేసింది. మ‌ళ్లీ అశోక గ‌జ‌ప‌తినే నియ‌మించాల‌ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో.. అస‌లు ఈ వివాదానికి కార‌ణ‌మేంటీ? మాన్సాస్ ట్రస్టు చరిత్ర ఏంటీ? ప్రభుత్వం ఏం చెబుతోంది? అన్న‌ది చూద్దాం.

పూస‌పాటి వంశీయులైన దివంగ‌త పీవీజీ రాజు 1958లో మ‌హారాజ అల‌క్ నారాయ‌ణ సొసైటీ ఆర్ట్ అండ్ సైన్స్ (MANSAS) ట్రస్టును స్థాపించారు. అప్పటి నుంచి ఈ ట్ర‌స్టు కొన‌సాగుతోంది. 2016 వ‌ర‌కు మాన్సాస్ ట్ర‌స్టు చైర్మ‌న్ గా ఉన్న ఆనంద గ‌జ‌ప‌తి మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత ట్ర‌స్ట్ చైర్మ‌న్ బాధ్య‌త‌ల‌ను పీవీజీ రాజు రెండో కుమారుడు అయిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు చేప‌ట్టారు.

అయితే.. 2020లో రాష్ట్ర ప్ర‌భుత్వం అశోక గ‌జ‌ప‌తి రాజును తొల‌గించింది. ఆయ‌న స్థానిలో దివంగ‌త ఆనంద గ‌జ‌ప‌తి రాజు కుమార్తె సంచ‌యిత‌ను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీచేసింది. ఈ విష‌యాన్ని హైకోర్టులో స‌వాల్ చేశారు అశోక గ‌జ‌ప‌తి. వంశ ఆన‌వాయితీ ప్ర‌కారం ఇంట్లో పెద్ద‌వారే చైర్మ‌న్ గా ఇన్నాళ్లూ కొన‌సాగారని, ఆ లెక్క‌న చూసుకున్నా.. తానే చైర్మ‌న్ గా ఉండాల‌ని ఆయ‌న వాదించారు. న్యాయ‌ప‌రంగా కూడా తానే ఉండాల‌న్నారు. దీనికి ప్ర‌భుత్వం ఏం చెప్పిందంటే.. రెండు కుటుంబాల‌కు రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో చైర్మ‌న్ ప‌ద‌విని అప్ప‌గించేందుకే.. ఇలా చేశామ‌ని తెలిపింది. కేసు విచారించిన న్యాయ‌స్థానం అశోక గ‌జ‌ప‌తికి అనుకూలంగా తీర్పు చెప్పింది.

ఈ ట్ర‌స్టు చైర్మ‌న్ గిరీకి అంత ప్రాముఖ్య‌త ఎందుకంటే.. మాన్సాస్ ట్ర‌స్ట్ ప‌రిధిలో ఒక‌టీ రెండు కాదు.. ఏకంగా 55 వేల కోట్ల రూపాయ‌ల విలువ చేసే 14 వేల ఎక‌రాల భూములు ఉన్నాయి. ఉత్త‌రాంధ్ర‌తోపాటు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు, చివ‌ర‌కు త‌మిళ‌నాడులో కూడా ఈ ట్ర‌స్టుకు చెందిన భూములు ఉన్నాయి. అదేవిధంగా ఈ ట్ర‌స్టు ప‌రిధిలో సింహాచ‌లంతోపాటు మ‌రో 108 ఆల‌యాలు ఉన్నాయి. ఇంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ది కాబ‌ట్టే.. వివాదం పెద్ద‌దైంది.

అయితే.. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్ల‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. మాన్సాస్ ట్ర‌స్టు విష‌యంలో స‌ర్కారు ఎక్క‌డా నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌లేద‌ని, హైకోర్టు తీర్పును పూర్తిగా ప‌రిశీలించిన త‌ర్వాత అప్పీలుకు వెళ్తామ‌ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు అన్నారు. దీంతో.. ఈ వివాదం ఏ మ‌లుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.