Begin typing your search above and press return to search.
మోడీ వల్లే ఆమె మిస్ వరల్డ్ అయిందట!
By: Tupaki Desk | 21 Nov 2017 11:24 AM GMTమిత్రుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంటే ఎలా ఉంటుందో...మనలాంటి వాళ్లకు ఎప్పుడో ఒకసారి అనుభవమే కదా? అప్పటివరకు ఉన్న ఆత్మీయత కాస్త వైరంగా మారిపోతుంది. రకరకాల విమర్శలు వచ్చేస్తాయి. సంబంధం ఉన్నవి సంబంధం లేనివి కూడా అందులో చేరిపోతాయి. అయితే ఇది వ్యక్తులకే పరిమితం కాదండోయ్..రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. తాజాగా బీజేపీ-శివసేన మధ్య సంబంధాలకు, పొరపొచ్చాలకు బాగా సూటవుతుంది.
ఇంతకీ విషయం ఏంటంటే..ఈ మధ్యే మానుషి చిల్లార్ మిస్ వరల్డ్ అయిన విషయం తెలిసిందే కదా. దానికి కారణం నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వమే అంటూ బీజేపీకి శివసేన పంచ్ వేసింది. పార్టీ పత్రిక సామ్నాలోని ఎడిటోరియల్ లో శివసేన భారీ సెటైర్ వేసింది. ఆమె గెలిచి ఇన్ని రోజులైనా బీజేపీ వాళ్లు ఇంకా ఎందుకు బయటకు వచ్చి ఆ గొప్పతనం తమదేనని ఎందుకు చెప్పుకోవడం లేదో తమకు ఆశ్చర్యం కలుగుతున్నదని ఓ వ్యంగ్యాస్ర్తాన్ని సంధించింది. అంతేకాదు ఆమె ఇంటిపేరును, మోడీ నోట్ల రద్దుకు లింకు పెట్టిన కాంగ్రెస్ నేత శశి థరూర్ లాగే శివసేన కూడా చిల్లర వ్యాఖ్యలు చేసింది. మానుషి ఇంటిపేరు చిల్లర్. అందుకే ఆమె గెలిచింది. ఇది నిజానికి మోదీ నోట్ల రద్దు ఘనత. వెయ్యి, 500 నోట్లు రద్దయిన తర్వాత ప్రజల దగ్గర చిల్లరేగా మిగిలింది. అయినా బీజేపీ నుంచి ఎవరూ బయటకు వచ్చి ఈ గొప్పతనం తమదని ఎందుకు చెప్పుకోవడం లేదు అంటూ శివసేన వ్యాఖ్యానించడం గమనార్హం.
ఓవైపు కాంగ్రెస్ నేత శశిథరూర్ కామెంట్స్ వివాదమవుతున్న సమయంలోనే శివసేన కూడా బీజేపీని లక్ష్యంగా చేసుకోవడానికి అవే వ్యాఖ్యలను ఆధారం చేసుకోవడం గమనార్హం. ప్రపంచంలో ఎవరు అత్యధిక జీతం అందుకోవాలన్న ప్రశ్నకు.. అమ్మ అని ఆన్సర్ ఇవ్వడం మానుషికి మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించిపెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపైనా సామ్నా పత్రిక సెటైర్ వేసింది. `అది తప్పు. ఇది నోట్ల రద్దు ఘనతే. పెద్ద నోట్లు రద్దవడంతో కేవలం చిల్లరే మిగిలింది` అంటూ మరోసారి అవే వ్యాఖ్యలను రిపీట్ చేసింది. దీనిపై ఇప్పటికే థరూర్ క్షమాపణ చెప్పగా.. ఆ కామెంట్స్‌ను తాను పెద్దగా పట్టించుకోలేదని మిస్ వరల్డ్ మానుషి చిల్లార్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజా కామెంట్లతో శివసేన-బీజేపీ మధ్య దూరం పూడ్చలేని స్థాయికి చేరిందని అంటున్నారు.