Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఉప సమరంలో ‘ఈ. రాజేందర్’ పేరుతో అంతమంది ఉన్నారట

By:  Tupaki Desk   |   9 Oct 2021 3:27 AM GMT
హుజూరాబాద్ ఉప సమరంలో ‘ఈ. రాజేందర్’ పేరుతో అంతమంది ఉన్నారట
X
కీలకమైన ఎన్నికలు జరుగుతున్న వేళ.. బలమైన అభ్యర్థిని దెబ్బ తీసేందుకు చేసే ప్రయత్నాలు చాలా వినూత్నంగా ఉంటాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో కారును పోలి ఉన్న వాహన గుర్తులతో అధికార టీఆర్ఎస్ కు దిమ్మ తిరిగిపోయేలా షాకులు ఎదురైన సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉలిక్కిపడే ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది.

శుక్రవారంనామినేషన్ల ప్రక్రియ ముగిసిన వేళ.. మొత్తం ఎంతమంది నామినేషన్లు వేశారన్న లెక్కల్ని చూస్తే.. 61 మంది తేలటం తెలిసిందే. అయితే.. ఈ నామినేషన్ల దాఖలు విషయంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ ను ఇంగ్లిషులో పొట్టిగా చేసి చూస్తే.. ‘ఈ. రాజేందర్’ పేరు వస్తుంది. సరిగ్గా.. ఇదే పేరుతో పలువురు నామినేషన్లు వేయటం గమనార్హం.

ఈ. రాజేందర్ పేరులో ఏ మాత్రం తేడా లేకపోవటం.. ఈ అంటే ఈటల మాత్రమే కాకుండా.. ఈసంపల్లి.. ఇమ్మడి.. ఇప్పటిపల్లి ఇలా పలు ఇంటి పేర్లు.. మొదటి ఇంగ్లిషు అక్షరం మాత్రం ‘ఈ’ ఉండటం గమనార్హం. ఏరికోరి.. వెతికి మరీ ఎన్నికల బరిలోకి తీసుకొచ్చినట్లుగా వారి నామినేషన్లు దాఖలైనట్లుగా చెబుతున్నారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈ. రాజేందర్ (ఇమ్మడి రాజేందర్).. న్యూ ఇండియా పార్టీ తరఫున అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఈ. రాజేందర్ (ఈసంపల్లి రాజేందర్).. ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ అభ్యర్థిగా ఈ. రాజేందర్ (ఇప్పలపల్లి రాజేందర్)లే నామినేషన్లు వేయటం గమనార్హం.

చూస్తుంటే.. ఈటల రాజేందర్ కు సవాలు విసిరేలా పలువురు అభ్యర్థులు అదే పేరుతో ఉన్న వారు పోటీలోకి దించినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. తన పేరుతో ఉన్న వారిని ఎన్నికల నుంచి విత్ డ్రా చేయించటంలో ఈటల ఏ మేరకు సక్సెస్ అవుతారన్న దాని మీదనే ఆయన గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పక తప్పదు. ఒకవేళ.. ఏ పార్టీ నుంచి పోటీ చేయకుండా.. ఈటల రాజేందర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే మాత్రం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.