Begin typing your search above and press return to search.

ఎండకు తిరగడం లేదా? అయితే జాగ్రత్త..!

By:  Tupaki Desk   |   19 Dec 2021 5:30 PM GMT
ఎండకు తిరగడం లేదా? అయితే జాగ్రత్త..!
X
ఎండకు తిరగడం నిజానికి చాలామంచిది. సూర్యరశ్మిలో కాసేపు ఉంటే చాలు.. మనకు కావాల్సిన డి విటమిన్ లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని మలిన పదార్థాలు కొన్ని చెమట రూపంలో బయటకువెళ్తాయి. నవజాత శిశువులను సైతం డి విటమిన్ కోసం ఉదయపు ఎండలో ఉంచుతారు. ఇటీవల కాలంలో చాలామంది ఎండకు తిరగడం తగ్గించేశారు. కారణం కరోనా.. ఈ మహమ్మారి పుణ్యమా అని అనవసరంగా బయట తిరగడం తగ్గించేశారు. అంతేకాకుండా ఆఫీసులకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. మొన్నటిదాకా పిల్లలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఈ కారణంగా చాలామందిలో డి విటమిన్ తగ్గిపోయిందని ఓ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా దీనివల్ల పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

కరోనా వేరియంట్ల రూపంలో విజృంభిస్తుండడంతో చాలామంది ఇళ్లకే అతుక్కుపోతున్నారు. అంతేకాకుండా నిత్యం మాస్కు ధరిస్తున్నారు. ఇక అలాంటివారికి సాధారణ జలుబు కూడా రావడం లేదని శాస్త్రవేత్తల సర్వేలో వెల్లడైంది. ఇదే సమయంలో జలుబు కూడా సూపర్ కోల్డ్ గా మారిందట. అంటే డి విటమిన్ బాగా తగ్గిపోతుండడం వల్ల చాలామందిలో ఈ జలుబు చేస్తుందని వారి పరిశోధనల్లో స్పష్టమైందని తెలిపారు. ఈ ఇన్ ఫెక్షన్ వల్ల జలుబుతోపాటు ఛాతీ సంబంధ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. విటమిన్ డి లోపంతో ఇతర సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని వివరించారు.

విటమిన్ డి అనేది సూర్యరశ్మి ద్వారానే ఎక్కువగా లభిస్తుంది. సాధారణంగా మనిషికి కావాల్సిన డి విటమిన్ లో 90శాతం సూర్యరశ్మి... ఓ 10 శాతం ఇతర ఆహార పదార్థాల వల్ల లభిస్తుంది. మనం తినే ఆహారంలో ఇది చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కరోనా వల్ల ఇళ్లకే పరిమితం కావడం వల్ల చాాలామందిలో విటమిన్ డి తగ్గుతూ వస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. లండన్ లో సగం మంది ఇలాంటి సమస్యలకే గురయ్యారని పరిశోధకులు వెల్లడించారు. అలాంటి వారు డి-సప్లిమెంట్ వాడుతున్నారని తెలిపారు. లేదంటే బాగా నీరసానికి గురవుతున్నారని చెప్పారు. విటమిన్ డి ట్యాబ్లెట్ తో కాస్త ఉపశమనం కలుగుతుందని చెప్పారు.

విటమిన్ డి తక్కువగా ఉన్న వాళ్లు... ట్యాబ్లెట్ వాడడం వల్ల జలుబు వంటి ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఒకవేళ పడినా... ఆ ఇన్ ఫెక్షన్ల ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన విటమిన్ డి... ట్యాబ్లెట్ రూపంలో కాకుండా సహజంగా పొందితే ఆరోగ్యకరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎండలో తిరగకపోతే ఇతర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు. రోజుకు కొంతసమయమైనా సూర్యరశ్మిలో గడపాలని వారు స్పష్టం చేశారు. అసలే కరోనా కాలం... కాబట్టి ఎటువంటి విటమిన్ లోఓపం లేకుండా ఉంటే మంచిది. అందుకే సాధ్యమైనంత మేరకు వ్యాయామం చేస్తూ... కాసేపు అలా ఎండలో ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.