Begin typing your search above and press return to search.

ద‌ళితబంధు.. ఆవెంట‌నే బీసీ బంధు... ఇప్పుడు కూలీ బంధు!

By:  Tupaki Desk   |   14 Aug 2021 2:42 AM GMT
ద‌ళితబంధు.. ఆవెంట‌నే బీసీ బంధు... ఇప్పుడు కూలీ బంధు!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న రీతిలో ప్ర‌వేశ‌పెట్టి దళిత బంధు పథకం ఇటు విమ‌ర్శ‌లు అటు ప్ర‌శంస‌లు అందుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నట్లు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నేత‌లు కూడా ప్ర‌కటించేస్తుండ‌టం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఓ వైపు ఈ ట్విస్టులు కొన‌సాగుతుంటే మ‌రోవైపు వివిధ వ‌ర్గాల నుంచి త‌మ‌కు సైతం ఇలాంటి ప‌థ‌కాలు కావాల్సిందేన‌న్న డిమాండ్లు వ‌స్తున్నాయి. ఈ ఒర‌వ‌డిలో తాజాగా కూలీల త‌ర‌ఫున సైతం ఓ డిమాండ్ వ‌చ్చింది.

దళితులకు దళిత బంధు ప్ర‌క‌టించిన‌ట్లే బీసీలకు బీసీ బంధు ఇవ్వాలని ప్ర‌ముఖ బీసీ నేత‌ ఆర్‌.కృష్ణయ్య ఇప్పటికే డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. బీసీ బంధు కోసం పోరాటం చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి వి. హనుమంతరావు సైతం ఇదే విష‌యంలో ప్ర‌శ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే పథకాలు గుర్తుకు వస్తాయా? అని నిల‌దీశారు. బీసీ బంధు ఇవ్వకుంటే టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని వీహెచ్‌ హెచ్చరించారు. తాజాగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు మాదిరిగానే తెలంగాణలో కూలీబంధు కూడా ప్రవేశపెట్టాలని ఆలిండియా అగ్రికల్చరల్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐఏడబ్ల్యూయూ) డిమాండ్ చేసింది.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆన్‌లైన్‌లో జరిగింది. కేసీఆర్‌ సర్కారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం కేవలం వాసాలమర్రి, హుజూరాబాద్‌ ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని వ‌క్త‌లు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ద‌ళితుల‌ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని దుస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుచేత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద దళితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూలీబంధును ప్రవేశపెట్టాలన్నారు. ఎస్సీలకు మూడెకరాల పంపిణీ మధ్యలోనే ఆగిపోయిందని గుర్తు చేశారు. ఆ విధంగా దళితులు కాకూడదని చెప్పారు. కేరళ ప్రభుత్వం ఇస్తున్నట్టు వ్యవసాయ కూలీలకు 14 రకాల నిత్యావసర సరకులను ఉచితంగా ఇవ్వాలన్నారు. ఆగస్టు 18,19 తేదీల్లో దళితబంధు రాష్ట్రవ్యాప్త అమలు, కూలీబంధు సాధన కోసం రౌండ్‌టేబుల్‌ సమావేశాలు పెట్టాలని సూచించారు. ఈ డిమాండ్ పై కేసీఆర్ ఎలా స్పందిస్తారో మ‌రి.