Begin typing your search above and press return to search.

జపాన్ లో ఆడోళ్లకు ఇన్ని తిప్పలా?

By:  Tupaki Desk   |   9 Nov 2019 8:54 AM GMT
జపాన్ లో ఆడోళ్లకు ఇన్ని తిప్పలా?
X
డిజిటల్ జమానాలో అలా చేయొద్దు.. ఇలా చేయండన్న మాట వింటేనే తెగ చిరాకు వచ్చేస్తుంది. అందునా లాజిక్ ఏ మాత్రం లేని రీతిలో పెట్టే ఆంక్షల గురించి విన్నంతనే ఒళ్లు మండుతుంది. టెక్నాలజీలో దూసుకెళ్లిపోవటమే కాదు.. మేథోపరంగా చూస్తే.. మిగిలిన వారి కంటే మొనగాళ్లుగా చెప్పే జపనీయులు.. ఆడోళ్ల మనసుల్ని దోచుకునే విషయంలో మాత్రం ఎప్పుడూ వెనుకబడే ఉంటారన్న నింద వారి మీద ఉంది.

సాంకేతికంగా ముందున్నా.. ఆడోళ్లను సంతోష పెట్టటం.. వారిని మహారాణులుగా చూసుకోవటంలో జపనీయులు దరిదాపుల్లోకి కాదు కదా.. సమీప భవిష్యత్తులోనూ వారికి అలాంటి మైండ్ సెట్ వచ్చే ఛాన్స్ లేదని చెబుతారు. వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జపాన్ మహిళల వేషధారణపై విధిస్తున్న ఆంక్షలు విచిత్రంగానే కాదు.. నిజమా అనిపించేలా ఉండటం గమనార్హం.

ఆఫీసులో పని చేసే మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కళ్లజోళ్లను వాడొద్దని స్పష్టం చేస్తున్నారు. వారి మేకప్ ను డామినేట్ చేస్తాయని కొందరు యజమానులు అంటుంటే.. మరికొందరు మాత్రం ముందస్తుజాగ్రత్తలో భాగంగానే తామీ విషయాన్ని చెబుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ నిబంధన మీద జపాన్ మహిళలు మాత్రం మండిపడుతున్నారు. కళ్లజోడులో హాట్ గా ఉండరు కాబట్టి.. బాస్ కు నచ్చదని.. అందుకే ఈ దిక్కుమాలిన ఆంక్షలంటూ తిట్టి పోస్తున్నారు.

కళ్లజోడు రూల్ ఇలా ఉంటే.. మరో సిత్రమైన రూల్ కూడా పెట్టేస్తున్నారు. ఆఫీసులో వర్క్ చేసే అమ్మాయిలు ఎవరైనా సరే.. షూ కాకుండా ఎత్తైన హైహీల్స్ వేసుకోవాలని రూల్ తీసుకొచ్చేశారు. గంటల తరబడి హైహీల్స్ వేసుకోవటం వల్ల కాళ్లు నొప్పులు పుడుతున్నాయని వాపోతున్నారు. అయినా.. ఈ రూల్స్ అన్ని మహిళలకే ఎందుకు? మగాళ్లకు ఎందుకు పెట్టరు? అని ప్రశ్నిస్తున్నారు.

గంటల తరబడి హైహీల్స్ వేసుకొని పని చేస్తే.. కాళ్లు ఎర్రగా వాచిపోవటమే కాదు.. విపరీతమైన అసౌకర్యంతో ఉంటుందన్న విషయాన్ని ఎందుకు గుర్తించరు? అని ప్రశ్నిస్తున్నారు. వైద్యులు సైతం ఇది సరికాదంటున్నా.. యజమానులు మాత్రం వెనక్కి తగ్గట్లేదట. జపాన్ లోని మహిళా ఉద్యోగులే కాదు.. స్కూల్ అమ్మాయిలకూ కూడా పాడు పరిమితులు పెట్టి వారిని వేధిస్తున్నట్లు చెబుతున్నారు.

నల్లటి జుట్టుతో.. వైవిధ్యమైన జడతోనే స్కూల్ కు రావాల్సి ఉంటుందని రూల్స్ పెడుతున్నారు. దీనిపైన పాఠశాల విద్యార్థినులు సైతం ఫైర్ అవుతున్నారు. జపాన్ లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ తరహా సమస్యలపై గళం విప్పేందుకు వీలుగా సోషల్ మీడియాలో #KuToo ఉద్యమాన్ని షురూ చేశారు. ఇంతకీ క్యూ అంటే ఏమంటారా? బాధ అని అర్థం. తాము ఎదుర్కొంటున్న బాధపైన వారు గళం విప్పుతూ.. తమ సమస్యలు ప్రపంచానికి చాటేలా చేస్తున్నారు. అనుకుంటాం కానీ.. జపాన్ ఆడోళ్లతో పోలిస్తే.. మన దగ్గరే పరిస్థితి చాలా సౌకర్యవంతంగా ఉందనిపించట్లేదు?