Begin typing your search above and press return to search.

హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలా ?

By:  Tupaki Desk   |   10 Dec 2021 5:30 AM GMT
హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలా ?
X
తమిళనాడులో కూనూరులో హెలికాప్టర్ ప్రమాదం జరిగి 24 గంటలు కాకముందే అనేక అనుమానాలు రేగటం ఆశ్చర్యంగా ఉంది. బుధవారం మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 12 మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే.

ప్రమాదం జరిగిందని తెలియగానే చాలా సేపు బిపిన్ రావత్ ఏమయ్యారనే టెన్షన్ పెరిగిపోయింది. చివరకు సాయంత్రం రావత్ కూడా ఇక లేరనే చేదువార్తతో యావత్ దేశం బాధలో మునిగిపోయింది.

మధ్యాహ్నం హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని తెలియగానే వాతావరణం సరిగాలేదని, పొగమంచే కారణమనే ప్రచారం విపరీతంగా జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నానికి హెలికాప్టర్ ప్రమాదానికి వాతావరణం అనుకూలించకపోవటం కాదు, పొగమంచు కారణం కాదనే అనుమానాలు పెరిగిపోయాయి. సర్వీసెస్ లో పనిచేసిన కొందరు ఉద్యోగులు పొగమంచు కారణంగానే హెలికాప్టర్ కూలిపోయిందనే వాదనతో విభేదించారు.

చివరకు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా హెలికాప్టర్ ప్రమాదానికి పొగమంచు కారణమంటే అంగీకించలేదు. చాలామంది ఆర్మీలో పనిచేసిన వారు, సీనియర్ సర్వీసెస్ ఉద్యోగులు పొగమంచు కారణం అయిఉండదని అన్నారే కానీ ఏమి జరిగుంటుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేకపోయారు. ఒకవైపు ఎవరి వాదనల్లో వారుండగానే బీజేపీ ఎంపి సుబ్రమణియన్ స్వామి ట్విట్టర్ వేదికగా చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది.

హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర ఏదో జరిగిందనే అనుమానం వచ్చేట్లుగా ఆరోపించారు. దాంతో స్వామి ఆరోపణలకు మద్దతు పెరుగుతోంది. స్వామి వాదన ప్రకారం హెలికాప్టర్ ప్రమాదం జరిగినపుడు వాతావరణంలో పొగమంచేమీ లేదు.

తనకున్న సోర్సెస్ అంటు స్వామి చేసిన ఆరోపణలు ఇపుడు కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా తయారవుతోంది. ఇదే సమయంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగిన దృశ్యాలంటు ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

దీనిపై స్వామి మాట్లాడుతూ వీడియోలో కనబడుతున్న హెలికాప్టర్ సిరియాలో ఎప్పుడో జరిగిన ప్రమాదానికి సంబంధించిందిగా చెప్పారు. రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదం కాదని ట్వీట్లో స్వామి చెప్పటంతో చాలామందిలో ప్రమాద ఘటనపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తే ఏమి తెలుస్తుంది ? ఎయిర్ ఫోర్స్ అంతర్గత విచారణలో ఏమి తేలుతుందో చూడాలి.