Begin typing your search above and press return to search.

ఏవోబీలో టెన్ష‌న్‌... టెన్ష‌న్‌.. ఏం జ‌రుగుతోంది..!

By:  Tupaki Desk   |   16 Sep 2019 7:35 AM GMT
ఏవోబీలో టెన్ష‌న్‌... టెన్ష‌న్‌.. ఏం జ‌రుగుతోంది..!
X
చ‌త్తీస్‌ ఘ‌డ్‌ - ఒడిశా రాష్ట్రాల్లో జ‌రుగుతున్న వ‌రుస ఎన్‌కౌంట‌ర్ల నేప‌థ్యంలో మావోయిస్టులు త‌ల‌దాచుకునేందుకు ఆంధ్ర‌, ఒడిశా స‌రిహ‌ద్దు (ఏవోబీ)లోకి వస్తున్నారా..? ఇదే స‌మ‌యంలో ఏవోబీలో భారీ అల‌జ‌డి సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా..? ఇందులో భాగంగా యాక్ష‌న్ టీములు కూడా రంగంలోకి దిగాయా..? అంటే ఇంటెలిజెన్స్‌ వ‌ర్గాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. ఈ నేప‌థ్యంలో వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ త‌నిఖీలు చేస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆదివారం విశాఖ‌ప‌ట్నం జిల్లా ముంచంగిపుట్టు - పెదబయలు మండల కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

ప్ర‌ధానంగా జోలాపుట్టు, కుమడ, డుడుమ మార్గాల్లో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతీ వాహనాన్ని ఆపి - బ్యాగులు తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి విడిచిపెట్టారు. ముంచంగిపుట్టు నుంచి కుభజంగి జంక్షన్‌ వరుకు బాంబు స్క్వాడ్‌ తో కల్వర్టులు - వంతెనల కింద తనిఖీలు చేశారు. అయితే.. కొన్ని నెలలుగా ఒడిశా - ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టులు పోలీసుల మధ్య త‌ర‌చూ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్య‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్ర - ఒడిశా సరిహద్దు (ఏవోబీ) వైపు మావో యిస్టులు వచ్చి తలదాచుకుంటున్నార‌నే ఇంటెలిజెన్స్ వ‌ర్గాల స‌మాచారం పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. దీనికి తోడుగా మావోయిస్టు యాక్షన్‌ టీంలు కూడా రంగంలోకి దిగినట్టు అనుమానిస్తున్న పోలీసులు ఏవోబీలో గ‌ట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్ర‌ధానంగా పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లే పన్నెడ జంక్షన్, కొత్తాపుట్టు జంక్షన్లలో తనిఖీలు నిర్వహించారు. దీంతో ఏవోబీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల్లో తీవ్ర‌ ఆందోళన నెలకొంది.

ఒక్క‌సారిగా పోలీసుల త‌నిఖీలో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఖ‌మ్మం - వ‌రంగ‌ల్ జిల్లాల్లో గోదావ‌రి తీరం వెంట కూడా మావోయిస్టులు సంచ‌రిస్తున్న‌ట్లు అనుమానించిన పోలీసులు ఆ దిశ‌గా కూంబింగ్ ముమ్మ‌రం చేశారు. ఇదిలా ఉండ‌గా.. న‌ల్ల‌మ‌ల‌లో యురేనియం త‌వ్వ‌కాలకు అనుమ‌తులు ఇవ్వొద్ద‌ని - ప్ర‌జ‌లు ఉద్య‌మించాల‌ని కూడా మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసంది. ఈ నేప‌థ్యంలో కూడా మావోయిస్టుల క‌ద‌లిక‌ల‌ను ప‌సిగ‌ట్టేందుకు పోలీసు బ‌ల‌గాలు రంగంలోకి దిగాయి. ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ఎప్ప‌టిక‌ప్పుడు పోలీసు బ‌ల‌గాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏవోబీ భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది.