Begin typing your search above and press return to search.

బాబు బండారం బయటపెట్టిన మావోల లేఖ

By:  Tupaki Desk   |   6 Nov 2018 5:47 AM GMT
బాబు బండారం బయటపెట్టిన మావోల లేఖ
X
మావోయిస్టులు ఏపీ సీఎం చంద్రబాబు బండారంపై ఘాటైన లేఖ రాశారు. దాదాపు 5 పేజీల లేఖ ను పాడేరులో మీడియాకు విడుదల చేశారు. అరకు ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు చంపాక వారిపై టీడీపీ నాయకులు తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రా-ఒడిశా ఎస్.జడ్.సీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగబంధు ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాసిన లేఖ కలకలం రేపుతోంది. బాబు నక్కజిత్తులను జనం నమ్మరని ఆయన లేఖలో పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీలో ప్రస్తుతం కొనసాగుతున్న గిరిజనుల అక్రమ అరెస్ట్ లు - నిర్బంధకాండకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

+ లేఖలో మావోయిస్టులు పేర్కొన్న ముఖ్యాంశాలు ఇవీ

*ఏపీలో నిర్బంధ పద్ధతులకు సీఎం చంద్రబాబు చరమగీతం పాడాలి

*బీజేపీకి వ్యతిరేకమంటూ చంద్రబాబు చేస్తున్న నక్కజిత్తులను ప్రజలు నమ్మరు

*ఏజెన్సీలో కూంబింగ్ ల పేరుతో బాబు ప్రజలపై దాడులు చేసి యువకులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు..

*గిరిజనుల ఆస్తులు - ఇళ్లు ధ్వంసం చేస్తున్నారు. రాసరాయి గ్రామంలో 26న అర్ధరాత్రి నలుగురు గిరిజనులను పట్టుకెళ్లిపోయారు. మహిళలను చితకబాదారు

*అక్టోబర్ 15న బూతం అన్నపూర్ణ - సింహాచలం అనే గిరిజనులను అరెస్ట్ చేశారు.

*పోలీస్ అధికారులు గంజాయి వ్యాపారుల నుంచి లంచాలు తీసుకుంటూ మావోలపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. గంజాయి లంచాల కారణంగానే 2016లో ఏఎస్పీ ఆత్మహత్య చేసుకున్నాడు.

*పోలీసులు చంద్రబాబు ఏజెంట్లు మారి నిజాయితీ - ధైర్యం కోల్పోయారు..

*హుకుంపేట - అనంతగిరి మండలాలు మినహా ఏజెన్సీలోని అన్ని మండలాల్లో అమాయక గిరిజనులను అరెస్ట్ చేశారు. దీనికి మండలస్థాయి - జిల్లా స్థాయి నాయకులు మూల్యం చెల్లించకతప్పదు.

*చంద్రబాబు కుంభకోణాలపై మావోలు లేఖలో పేర్కొన్నారు.

విశాఖలో భూముల కుంభకోణం.. కాల్ మనీ కుంభకోణాలు ఏమయ్యాయో చెప్పాలని మావోయిస్టు ప్రతినిధి లేఖలో విమర్శించారు. చట్టాలు ఉల్లంఘించి లేటరైట్ - గ్రానైట్ - చైనా క్లే - రంగురాళ్ల తవ్వకాలు జరిపినందుకే కిడారి - సివేరి సోములు మూల్యం చెల్లించుకున్నారని వివరించారు. అక్రమ మైనింగ్ తో వందల కోట్లు సంపాదించుకునేందుకే పార్టీ మారి ఏజెన్సీని దోచుకున్నారని విమర్శించారు.

*సుజానా చౌదరిని ప్రస్తావించిన మావోలు

బ్యాంకులకు వందల కోట్లు ఎగనామం పెట్టిన సుజానా చౌదరి వంటి నేరస్థులను చంద్రబాబు - డీజీపీ కాపాడుతున్నారని మావోయిస్టు ప్రతినిధి లేఖలో విమర్శించారు. ఇసుక - భూదొంగలు - మద్యం మాఫియా గాళ్లకు ఏపీ ప్రభుత్వం రక్షణగా ఉందన్నారు. ఏజెన్సీ దమనకాండపై అన్ని రాజకీయ - స్వచ్ఛంద సంఘాలు నోరు విప్పాలని కోరారు. అక్టోబర్ 8న పెదబయలు మండలంలో గాయపడిన పోలీసుల విషయాన్ని ఎందుకు దాచారని నిలదీశారు. అక్టోబర్ 29న సీకుపనస గ్రామంలో ప్రజలు నిరసన తెలిపితే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ఇటువంటి చర్యలతోనే ప్రజాగ్రహం పెల్లుబుకుతుందని హెచ్చరించారు.