Begin typing your search above and press return to search.

ఆర్కే ఉత్కంఠ తేలిపోయినట్లే..

By:  Tupaki Desk   |   4 Nov 2016 4:29 AM GMT
ఆర్కే ఉత్కంఠ తేలిపోయినట్లే..
X
ఆంధ్రా.. ఒడిశా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించిన వైనం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ లో మావోల అగ్రనేత ఆర్కే గన్ మెన్ మరణించటం.. ఆర్కే గాయపడ్డారని.. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆర్కే సతీమణి శిరీష అయితే.. ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త జాడను బయటకు తీసేలా కోర్టు ఆదేశించాలని కోరారు.

ఇదిలాఉంటే.. ఆర్కే క్షేమంగా ఉన్నారని.. ఆయనకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదంటూ మావోయిస్ట్ వర్గాలు స్పష్టం చేయటంతో పాటు.. ప్రజా హక్కుల నేత వరవరరావు సైతం ధ్రువీకరించటం గమనార్హం. ఆర్కే క్షేమంగా ఉన్నట్లుగా తనకు సమాచారం వచ్చినట్లుగా ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో ఏర్పాటు చేసిన సభకు సంబంధించిన సమాచారాన్ని పద్మక్క వెల్లడించారు. అది సామాన్యమైన సభ కానే కాదని.. మావోయిస్ట్ పార్టీ పునర్ వ్యవస్థీకరణ.. కీలక బాధ్యతల్లో మార్పులు.. చేర్పులు.. భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఏర్పాటు చేసిన మీటింగ్ గా చెబుతున్నారు.

కానీ.. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ తో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. కొత్తగా బాధ్యతలు చేపట్టాల్సిన పలువురు ఎన్ కౌంటర్లో మరణించినట్లుగా తెలుస్తోంది. ప్రజా సమస్యల్ని ఆయుధంగా చేసుకొని ఉద్యమాలు నిర్మించాలని.. గ్రామాలు.. పట్టణాల్లో ఉన్న పార్టీ సానుభూతిపరుల సహకారం తీసుకొని పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టటమే లక్ష్యమన్న విషయం బయటకు వచ్చింది. అయితే.. ఈ ఆలోచనలకు ఎన్ కౌంటర్ బ్రేకులు వేసిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. జైల్లో ఉన్న మావో నేతల కుటుంబీకులను జాగ్రత్తగా చూసుకోవాలని.. వారికి తగిన గౌరవం ఇవ్వాలని మావోయిస్ట్ కేంద్ర కమిటీ సూచన చేయటం గమనార్హం. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మావోల అగ్రనేత ఆర్కే ఫుల్ సేఫ్ గా ఉన్న విషయం తాజా మాటలతో స్పష్టమైందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/