Begin typing your search above and press return to search.

పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై మావోయిస్టు న‌జ‌ర్‌.. లేఖ క‌ల‌క‌లం!!

By:  Tupaki Desk   |   31 Jan 2021 12:44 PM GMT
పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై మావోయిస్టు న‌జ‌ర్‌.. లేఖ క‌ల‌క‌లం!!
X
పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యం మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భుత్వానికి, ఎస్ ఈసీకి మ‌ధ్య ర‌గ‌డ జ‌రిగిన వివాదం.. ఒక ఎత్త‌యితే.. ఇప్పుడు మావోయిస్టులు కూడా ఈ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం మ‌రింత క‌ల‌క‌లం సృష్టిస్తోంది. తొలి విడ‌త నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మై.. నాలుగు రోజులు గ‌డిచిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మావోయిస్టు కీల‌క నేత .. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ ఉర‌ఫ్ వెంక‌ట చైత‌న్య పేరిట విడుద‌లైన లేఖ‌.. తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. పంచాయితీ ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని లేఖ‌లో హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి.

అంతేకాదు.. రాజ‌కీయ పార్టీల‌పైనా.. అరుణ త‌న లేఖ‌లో నిప్పులు చెర‌గ‌డం గ‌మ‌నార్హం. విశాఖ మ‌న్యంలో ఆదివారం వెలుగు చూసిన లేఖ ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోను, పోలీసు విభాగంలోను కూడా క‌ల‌క‌లం రేపింది. `` బూటకపు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఒరిగేది ఏమీ లేదు. దోపిడీ పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీలకు జనమే బుద్ది చెప్పాలి. దోపిడీ పార్టీలను తన్ని తరిమేయాలి. ఎన్నికల సమయంలో జగన్.. విశాఖ మన్యంలో బాక్సైట్ తొవ్వకాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ఇచ్చిన హామీలను నెర‌వేర్చాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయులు సహా అన్ని పోస్టులను నూటికి నూరు శాతం భర్తీ చేస్తామన్న హామీకి అనుగుణంగా జీవో నవంబర్ 3 జారీ చేశారు. అయితే న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఏపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదు. ఇక‌నైనా రివ్యూ పిటిష‌న్ వేయాలి. పరిపాలనా సౌలభ్యం కంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం జగన్ సర్కారు మూడు రాజధానులంటూ నాటకాలు ఆడుతోంది`` అని అరుణ లేఖ‌లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. కాగా, ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ తలపై ఇప్పటికే రూ. 6 లక్షల రివార్డు ఉంది. విశాఖ మన్యంలో పలువురు రాజకీయ నేతల హత్యల్లో నిందితురాలిగా ఉన్నారు.