Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ కేసీఆర్ కు మావోయిస్టుల షాక్

By:  Tupaki Desk   |   6 May 2019 6:41 AM GMT
ఎన్నికల వేళ కేసీఆర్ కు మావోయిస్టుల షాక్
X
తెలంగాణ పరిషత్ ఎన్నికల వేళ మావోయిస్టుల కలకలం మరోసారి చెలరేగింది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో సీపీఐ మావోయిస్టు పేరిట వెలిసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక ఇలా సెంటర్ పాయింట్ లో మావోయిస్టుల ఉనికి బయటపడడం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఆ పోస్టర్లలో ఖబడ్దార్ సీఎం కేసీఆర్ అంటూ హెచ్చరించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి డివిజన్ పరిధిలోని పోతేపల్లి, తాండ్ర, భైరాపూర్ గ్రామాల్లో సీపీఐ మావోయిస్టు పార్టీ పేరిట వెలిసిన ఈ పోస్టర్లు హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తర తెలంగాణలోని చత్తీస్ ఘడ్ సరిహద్దు గ్రామాల్లో మాత్రమే మావోయిస్టుల ఉనికి ఉండేది. ఇప్పుడు దక్షిణ తెలంగాణలో వారి ఉనికి బయటపడడం సంచలనంగా మారింది.

మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు కనిపించాయి. చాలా కాలం తర్వాత తెలంగాణలో మావోయిస్టులు భద్రాద్రిజిల్లాలో పోలీసులే టార్గెట్ గా పెట్టిన మందుపాతరను కనిపెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఇక ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నేతలు - నాయకులకు వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఇప్పుడు పరిషత్ ఎన్నికల వేళ మావోయిస్టులు మళ్లీ ఉనికి చాటుకోవడం కలకలం రేపుతోంది. అది జనావాసాలు ఉండే మహబూబ్ నగర్ జిల్లాలో వారి పోస్టర్లు బయటపడడంతో మావోలపై నజర్ మళ్లీ మొదలైంది.