Begin typing your search above and press return to search.

ఎంత ఎన్ కౌంటర్ అయితే ఇంత అరాచకమా?

By:  Tupaki Desk   |   17 Sep 2015 4:48 AM GMT
ఎంత ఎన్ కౌంటర్ అయితే ఇంత అరాచకమా?
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చోటు చేసుకున్న తొలి ఎన్ కౌంటర్ సెగలు పుట్టిస్తోంది. అడవుల్లో కూంబింగ్ జరిపే సమయంలో తమపై కాల్పులు జరిపిన మావోలపై కాల్పులు జరిపిన నేపథ్యంలో ఒక మహిళా మావోతో పాటు.. మరొకరు మరణించినట్లు చెప్పారు. మరి.. నిజంగానే వారు ఎన్ కౌంటర్ అయ్యారా? అన్నది వారి మృతదేహాలు చూస్తే ఇట్టే అర్థమైపోతోంది.

ఎన్ కౌంటర్ లో మరణించిన ఇంజనీరింగ్ పీజీ చేసే శ్రుతి మృతదేహాన్ని చూసిన వారి నోట మాట రావటం లేదు. ఆమె శరీరం మీద కాలిన గాయాలు ఉండటం.. పొత్తికడుపు వరకు మాత్రమే చూపించిన వైద్యులు.. ఆ కింది భాగం చూడలేరని.. వద్దని వారించారంటూ ఆమె తల్లి చెబుతున్న మాటలు వింటే కడుపు తరుక్కుపోవటం ఖాయం. అన్ని ఎన్ కౌంటర్ల మాదిరే తాజాగా జరిగింది కూడా బూటకపు ఎన్ కౌంటర్ అన్న ఆరోపణలు భారీగా వినిపించటంతో పాటు.. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారి శరీరాలపై ఉన్న గాయాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి.

ఎన్ కౌంటర్ లో మరణించినట్లు చెబుతున్న ఇద్దరు మావో మృతదేహాల్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించటం.. అక్కడకు చేరుకున్న తల్లిదండ్రుల్ని.. మార్చురీకి అనుమతించకపోవటం వివాదాస్పదమైంది. చివరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శృతి తల్లిదండ్రుల్ని అనుమతించారు. లోపలికి వెళ్లి కూతురి మృతదేహాన్ని చూసి వచ్చిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేశంతో బయటకు వచ్చారు.

తన కూతురు శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయని.. దారుణంగా కాల్చి చంపినట్లు చెబుతున్నారు. కడుపు మీద యాసిడ్ పోయడంతో పేగులు.. మాంసపు ముద్దలు బయటకు కనిపిస్తున్నాయని చెప్పారు. శృతి కడుపు వరకు మాత్రమే చూపించిన వైద్యులు.. ఆ కింద నువ్వు చూడలేవమ్మా అని చెబితే వినని ఆమె తల్లి.. తన బిడ్డపై అత్యాచారం చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. చేతికి బాగా గాయాలయ్యాయని చెబుతున్నారు.

మంగళవారం అర్థరాత్రి ఎంజీఎస్ ఆసుపత్రికి తీసుకొచ్చిన మృతదేహాల్ని.. బుధవారం సాయంత్రం 4 సమయంలో అప్పగించారు. అనంతరం వరంగల్ లోని ఆమె స్వగృహానికి తీసుకెళ్లారు. ఎన్ కౌంటర్ లో మరణించిన మృతదేహాలకు బుల్లెట్టు గాయాలు తప్పించి మరోవి కనిపించకూడదు. కానీ.. శృతి మృతదేహాన్ని చూస్తే మాత్రం అంతకు మించి గాయాలు కావటం చూస్తే.. ఎన్ కౌంటర్ పేరిట ఆరాచకం జరిగిందన్న విమర్శలు జోరందుకున్నాయి.