Begin typing your search above and press return to search.

నలుగురు మంత్రులపై మావోల నజర్

By:  Tupaki Desk   |   18 July 2016 5:21 AM GMT
నలుగురు మంత్రులపై మావోల నజర్
X
తెలంగాణలో నలుగురు మంత్రులను మావోయిస్టులు టార్గెట్ చేసినట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో వారికి అదనపు భద్రత కల్పించడంతో పాటు స్వయంగా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. నలుగురు మంత్రులను - మరికొందరు అధికారులను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని.. వారిని మట్టుపెట్టేందుకు యాక్షన్‌ టీమ్‌ లను కూడా రంగంలోకి దింపారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ రూపంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరిత హారం కార్యక్రమ సమయంలోనే ఈ మంత్రులను - అధికారులను హతమార్చాలని మావోయిస్టులు వ్యూహం పన్నినట్లుగా తెలుస్తోంది. దీంతో హరిత హారం కార్యక్రమాల్లోనూ భద్రత పెంచనున్నారు. అయితే.. చత్తీస్‌ గఢ్‌ పోలీసు ఉన్నతాధికారులు ఉప్పందిస్తే కానీ తెలంగాణ పోలీసులకు - ఇంటిలిజెన్సు వర్గాలకు ఈ సమాచారం తెలియకపోవడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ తమ పార్టీ కార్యకలాపాలను ఉధృతంగా చేపట్టాలని మావోయిస్టు పార్టీ రచించిన వ్యూహాన్ని ప్రభుత్వం తిప్పికొట్టింది. మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు రాష్ట్రంలో చేసిన ప్రయత్నాలన్నింటినీ రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. అయితే.. చత్తీస్‌ గఢ్‌ లో ఇటీవల జరిగిన ఓ ఎదురుకాల్పుల్లో లభ్యమైన పత్రాల ప్రకారం తెలంగాణలో నలుగురు మంత్రులు - పలువురు ఐపీఎస్‌ అధికారులను అంతమొందించాలని మావోయిస్టులు పథక రచన చేసినట్లు బయటపడింది. దీంతో చత్తీస్‌ గఢ్‌ పోలీసులు రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. అప్పటి నుంచి నిఘా వర్గాలు మావోయిస్టుల కదలికలతోపాటు హరితహారం కార్యక్రమంలో గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చత్తీస్‌ గఢ్‌ - మహారాష్ట్ర పోలీసులను సమన్వయం చేసుకుని మావోయిస్టులు సరిహద్దు దాటి తెలంగాణలో ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఖమ్మం - వరంగల్‌ జిల్లా సరిహద్దుల్లోని ఏటూరునాగారం - ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగాయని విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడి తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.

కాగా మావోయిస్టులు ప్రధానంగా నలుగురు మంత్రులను లక్ష్యంగా ఎంచుకున్నట్లు వినిపిస్తోంది. హైదరాబాద్‌ పరిధిలోని ఒక మంత్రితోపాటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఇద్దరు - ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం తెలుసుకున్న ఉత్తర తెలంగాణాకు చెందిన ఒక మంత్రి ఇటీవల తన పర్యటనలన్నింటినీ పూర్తిగా తగ్గించుకుని పట్టణ ప్రాంతాలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. గతంలో తన శాఖాపరమైన పనులను పర్యవేక్షించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించే సదరు మంత్రి నిఘా వర్గాల హెచ్చరికలతో హైదరాబాద్‌ కు పరిమితమై శాఖాపరమైన సమావేశాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు తమదైన శైలిలో పనిచేస్తున్న ఇద్దరు ఐపీఎస్‌ ఉన్నతాధికారులపై మావోయిస్టులు గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు ఐజీపీ స్థాయి అధికారి - మరొకరు సీనియర్‌ ఐపీఎస్‌ అని అంటున్నారు. మొత్తానికి తాజా సమాచారంతో తెలంగాణ మంత్రులు మరింత జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టారు.