Begin typing your search above and press return to search.

దాడి త‌ర్వాత మావోలు వెళ్లింది ఎక్క‌డికంటే?

By:  Tupaki Desk   |   24 Sep 2018 5:29 AM GMT
దాడి త‌ర్వాత మావోలు వెళ్లింది ఎక్క‌డికంటే?
X
తీవ్ర సంచ‌ల‌నంగా మారిన అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు హ‌త్యాకాండ ఇప్పుడు పెను సంచ‌లంగా మారింది. కొన్నేళ్లుగా నిద్రాణంగా ఉన్న మావోలు ఈ స్థాయికి తెగ‌బ‌డ‌టం.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను హ‌త‌మార్చ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యేల‌పై కాల్పులు జ‌రిపిన మావోలు ఎవ‌రు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. దాడి అనంత‌రం మావోలు ఎక్క‌డికి వెళ్లారు? వారిని అదుపులోకి తీసుకోవ‌టం పోలీసుల‌కు సాధ్య‌మేనా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

హ‌త్య‌కు ప‌క్కా ప్లాన్ చేసిన మావోలు.. స్పాట్ ను వ్యూహాత్మ‌కంగా ఫిక్స్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. వాస్త‌వానికి అర‌కులోయ‌ను మావోలు షెల్ట‌ర్ జోన్ గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఈ ప్రాంతంలో దాడుల‌కు తెగబ‌డ‌రు. ఇక్క‌డ సేఫ్ గా ఉంటూ.. మిగిలిన ప్రాంతాల్లో దాడులు చేస్తుంటారు. తాజా హ‌త్యోదంతం ఇందుకు భిన్నంగా సాగ‌టం గ‌మ‌నార్హం. షెల్ట‌ర్ జోన్ లో దాడులు జ‌ర‌గ‌వ‌న్న‌ న‌మ్మ‌కాన్ని తాజా హ‌త్య‌కు వాడుకున్న‌ట్లుగా భావిస్తున్నారు.

ఎవ‌రికి అనుమానం రాకుండా ఉంటుంద‌న్న ఉద్దేశంతోనే తాజా దాడికి ప్లాన్ చేసి ఉంటార‌ని తెలుస్తోంది. అర‌కులోయ‌.. డుంబ్రిగుడ‌.. అనంత‌గిరి.. హుకుంపేట‌.. పెద‌బ‌య‌లు మండ‌లాల స‌రిహ‌ద్దులు ఒడిశా భూభాగంలో ఉంది. దాడి అనంత‌రం కేవ‌లం అర‌గంట‌.. గంట వ్య‌వ‌ధిలోనే మావోలు సేఫ్ జోన్లోకి వెళ్లేందుకు అనువుగా స్కెచ్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇక ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యేల‌పై దాడికి పాల్ప‌డింది ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. పోలీసుల అంచ‌నా ప్ర‌కారం చూస్తే.. మావోయిస్టు పార్టీ ఆంధ్రా.. ఒడిశా స‌రిహ‌ద్దు ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీ ప‌రిధిలోని నందాపూర్ ప్రాంతీయ క‌మిటీగా భావిస్తున్నారు. పార్టీ మిల‌ట‌రీ ప్ల‌టూన్ స‌భ్యుల‌తో క‌లిసి వీరు ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మై ఉంటార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ దాడికి పాల్ప‌డిన వారిని సైతం గుర్తించిన‌ట్లు స‌మాచారం.

ఏవోబీ మిల‌ట‌రీ క‌మిష‌న్ కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌హిస్తున్న‌ చ‌ల‌ప‌తి అలియాస్ రామ‌చంద్రారెడ్డి స‌తీమ‌ణి.. ఏవోబీ ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీ స‌భ్యురాలు అరుణ అలియాస్ వెంక‌ట ర‌వి చైత‌న్య నేతృత్వంలో ఈ హ‌త్యాకాండ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. దాడి అనంత‌రం మావోలు కుండ్రుమ రోడ్డు మీదుగా స‌న్నాయిగూడ కొండ‌ల‌వైపు వెళ్లి ఉంటార‌ని భావిస్తున్నారు.

ఎందుకంటే.. అక్క‌డికి స‌మీపంలోనే ఒడిశాలోని కొరాపూట్ జిల్లాకు చెందిన‌ గ్రామాలు ఉన్నాయి. అవన్నీ మావోలకు పెట్ట‌ని కోట‌లుగా చెబుతున్నారు. అరగంట‌.. గంట పాటు న‌డిస్తే చాలు త‌మ‌కు సుర‌క్షిత‌మైన ప్రాంతాల‌కు చేరుకునే వీలు ఉంటుంద‌న్న ఉద్దేశంతోనే తాజా స్పాట్‌ ను ఎంపిక చేసుకున్న‌ట్లు చెబుతున్నారు.