Begin typing your search above and press return to search.

ఆరుగురు టీఆర్ ఎస్ నాయ‌కుల కిడ్నాప్

By:  Tupaki Desk   |   19 Nov 2015 9:25 AM GMT
ఆరుగురు టీఆర్ ఎస్ నాయ‌కుల కిడ్నాప్
X
ఖ‌మ్మం జిల్లా భ‌ద్రాచ‌లం ఏజెన్సీలో ఆరుగురు టీఆర్ ఎస్ పార్టీ నాయ‌కుల‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. భ‌ద్రాచ‌లం నియోజ‌క‌వ‌ర్గంలోని చర్ల మండలం పూసగప్పలో ఈ ఘటన చోటుచేసుకుంది. చ‌ర్ల మండ‌ల కేంద్రానికి 30 కిలోమీట‌ర్ల దూరంలో ఉండే ఈ గ్రామానికి చెందిన ఆరుగురు అధికార పార్టీ నాయ‌కుల‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేయ‌డం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ఖమ్మం జిల్లా టీఆర్ ఎస్ నేత రామకృష్ణ సహా మొత్తం ఆరుగురు నాయ‌కుల‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.

రామ‌కృష్ణ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భ‌ద్రాచ‌లం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ ఎస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయ‌న టీఆర్ ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్ ఛార్జీగా కొనసాగుతున్నారు. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన వారిలో టీఆర్‌ ఎస్ డివిజన్ కార్యదర్శి మానె రామకృష్ణతో పాటు చర్ల మండలం టీఆర్‌ ఎస్ మాజీ అధ్యక్షుడు పటేల్ వెంకటేశ్వరరావు - మండల మాజీ కార్యదర్శి సంతపురి సురేష్‌కుమార్ - వెంకటాపురం మండలం టీఆర్‌ ఎస్ అధ్యక్షుడు సత్యనారాయణ - వాజేడు మండలం పార్టీ అధ్యక్షుడు దత్తకట్ల జనార్ధన్ - పూసుగప్ప మాజీ సర్పంచి రామకృష్ణ ఉన్నారు.

వీరు గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలుపై గ్రామస్తుల‌తో చర్చిస్తున్న సమయంలో మావోయిస్టులు వారిని కిడ్నాప్ చేశారు. అలాగే టీఆర్ ఎస్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండిస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జగన్‌ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. మావోయిస్టు ఎజెండానే టీఆర్ ఎస్ ఎజెండా అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని.... కూంబింగ్, అక్రమ అరెస్టులు నిలిపివేయాలంటూ మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ త‌న వైఖ‌రి మార్చుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. వరంగల్‌ లో సీఎం కేసీఆర్ సభలో నిరసన తెలిపిన ఎంటెక్ విద్యార్థి విజయ్‌ను మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మావోలు ఆరుగురు అధికార పార్టీ నేత‌ల‌ను కిడ్నాప్ చేయ‌డం తెలంగాణ‌లో పెద్ద సంచ‌ల‌న‌మైంది.