Begin typing your search above and press return to search.

7 వేల‌ కోట్లు మ‌ట్టిలో క‌ల‌వాల్సిందేనా?

By:  Tupaki Desk   |   24 Nov 2016 7:30 PM GMT
7 వేల‌ కోట్లు మ‌ట్టిలో క‌ల‌వాల్సిందేనా?
X
మావోయిస్టులంటే ఆయుధాలు - దాడులే కాదు ర‌హ‌స్య సంప‌ద‌కూ వారు అధిప‌తులు. వారేమీ దాన్ని విలాసాల‌కు వాడుకోక‌పోయినా... ఆస్తుల‌ను సంపాదించుకుని అనుభ‌వించే ఉద్దేశం లేక‌పోయినా పార్టీ మ‌నుగడ‌ - విస్త‌ర‌ణ కోసం పెద్ద ఎత్తున నిధులు స‌మకూర్చుంటారు వారు. కాంట్రాక్ట‌ర్లు - వ్యాపారులు - పారిశ్రామిక‌వేత్త‌లు... రాజ‌కీయ నేత‌ల నుంచి కూడా విరాళాలు సేక‌రించే మావోయిస్టుల వ‌ద్ద భారీగా న‌గదు ఉంటుంది. మావోయిస్టుల ప్ర‌భావిత రాష్ర్టాల‌న్నిట్లోనూ కలిపి సుమారు వెయ్యి కోట్ల మేర డంపుల్లో ఉంటాయ‌ని అంచ‌నా. ముఖ్యంగా ఏవోబీలో ఎక్కువ మొత్తంలో డ‌బ్బు డంపుల్లో ఉంద‌ని పోలీసుల అంచ‌నా.

మ‌హారాష్ట్ర - తెలంగాణ ప్రాంత అడ‌వులు... ఏపీలోని న‌ల్ల‌మ‌ల అడ‌వుల కంటే ఆంధ్ర‌, ఒడిశా స‌రిహ‌ద్దుల్లోని తూర్పు క‌నుమ‌లు - ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని దండ‌కార‌ణ్యం చాలా భిన్న‌మైన‌వి. అక్క‌డి అడ‌వులు అత్యంత ద‌ట్ట‌మైన‌వి. భారీ వృక్షాలే కాకుండా చెట్ల మొద‌ళ్ల‌లో చిన్న‌చిన్న మొక్క‌లు ద‌ట్టంగా అల‌ముకుని ఉంటాయి. దానివ‌ల్ల మావోయిస్టుల డంపులు బ‌య‌ట‌ప‌డ‌డం అసాధ్యం. తెలంగాణ జిల్లాల్లో సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు డంపులు దొరికిన సంద‌ర్భాలు చాలా ఉంటాయి కానీ తూర్పు క‌నుమ‌ల్లో మావోయిస్టుల డంపులు ప్ర‌జ‌ల‌కు దొరికిన సంద‌ర్భాలు గ‌త నాలుగు ద‌శాబ్దాల్లో రెండు మూడుకు మించి ఉండ‌వు. పోలీసుల‌కూ కూడా ఇక్క‌డి డంపులు చాలా రేర్ గా దొరుకుతుంటాయి. అది కూడా ప‌ట్టుబ‌డిన మావోయిస్టులు స‌మాచారం ఇస్తేనే సాధ్యం. అందుకే మావోయిస్టులు త‌మ సంప‌ద‌లో స‌గానికి పైగా తూర్పు క‌నుమ‌ల్లోనే దాచిపెడుతున్న‌ట్లు భావిస్తున్నారు. ఆ క్ర‌మంలో తూర్పు క‌నుమ‌లు, దండ‌కార‌ణ్యంలోనే 5 వేల‌ కోట్ల సంద‌ప దాచిన‌ట్లు అంచ‌నా. అవ‌న్నీ 500 - 1000 నోట్ల రూపంలోనే ఉండొచ్చు. నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో దాన్ని మార్చుకోవ‌డానికి మావోయిస్టులు ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పోలీసులు ఇది గుర్తించి నిఘా పెట్ట‌డంతో మావోయిస్టుల సంప‌ద డంపులు దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

పోలీసులు ఏవోబీలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని సంతలన్నింటిపై ప్రత్యేక నిఘా పెట్టారు. రెండ్రోజులక్రితం చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్‌ జిల్లా పామెడ్‌ పోలీసులకు ఆరులక్షల్తో గిరిజనుడు పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో అతడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మార్కెట్‌ కెళ్తున్నట్లు గుర్తించారు. అతని వద్దనున్న ఆరు లక్షల విలువైన నోట్లను మావోలే ఇచ్చి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా చర్ల మార్కెట్లో ఇద్దరు సానుభూతిపరులు 70వేల విలువైన పెద్దనోట్లను మారు స్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తాన్ని కూడా వీరికి

మావోలే ఇచ్చినట్లు ప్రాధమిక దర్యాప్తులో గుర్తించారు. దీంతో సరిహద్దు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగే వారాంతపు సంతలన్నింటిలో పటిష్ట నిఘా ఏర్పాటు చేసారు.

దేశంలోని మావోల వద్ద ఏడువేల కోట్ల విలువైన నగుదుం టుందని నిఘా వర్గాలు అంచనాలేశాయి. 1500కోట్ల వరకు దండకారణ్యంలో దాచుంటారని భావిస్తున్నారు. ఏవోబీ - జార్ఖండ్ లో 3 వేల కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. బెంగాల్ - బీహార్లో మ‌రో 1500 కోట్లు.. మ‌హారాష్ట్ర - మ‌ధ్య‌ప్ర‌దేశ్ - తెలంగాణ‌ - ఏపీలోని న‌ల్ల‌మ‌ల‌లో క‌లిసి వెయ్యికోట్లు ఉండొచ్చ‌ని అంచ‌నా. అంతా క‌లిపి 500 కోట్ల‌కు మించి వారు మార్చుకోవ‌డం అసాధ్య‌మ‌ని భావిస్తున్నారు. దీంతో మావోయిస్టుల డంపుల్లోని 7 వేల కోట్ల‌లో చాలావ‌ర‌కు మ‌ట్టిలో క‌ల‌వాల్సిందేనంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/