Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన మావోలు...?

By:  Tupaki Desk   |   8 March 2022 9:16 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన మావోలు...?
X
మావోయిస్టులు మరో మారు గర్జించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మీదనే తన గురిని సంధించారు. మా మాట వినకపోతే ప్రజా కోర్టులో కఠిన దండన తప్పదు అంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ జిల్లా ఏజెన్సీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మికి మావోలు తాజాగా వార్నింగ్ ఇవ్వడం పట్ల అధికార వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

విశాఖ ఏజెన్సీలో లాటరైట్ గనుల తవ్వకాల ముసుగులో బాక్సైట్ తవ్వకాలను పెద్ద ఎత్తున చేస్తున్నారని మావోలు మండిపడుతున్నారు. ఈ రకమైన అరాచక కార్యక్రమాలు మన్యంలో జరగడం వెనక పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఉందని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే పూర్తి పోత్సాహంతొనే విశాఖ ఏజెన్సీలో మళ్ళీ బాక్సైట్ తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని మావోయిస్టు పార్టీకి చెందిన అరుణ అంటున్నారు. ఈ మేరకు ఆమె తాజాగా విడుదల చేసిన లేఖలో పాడేరు ఎమ్మెల్యేకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు.

ఇప్పటికీ మాన్యాన్ని అన్ని విధాలుగా భ్రష్ట పట్టించే చర్యలను వైసీపీ సర్కార్ చేపడుతోందని ఆమె పేర్కొన్నారు. దానికి స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సహకరిస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ మాఫియాకు మాన్యాన్ని దారాదత్తం చేసే ఈ రకమైన చర్యలను మావోయిస్టులు చూస్తూ ఊరుకొరని ఆమె హెచ్చరించారు.

మన్యంలో మైనింగ్ మాఫియా కార్యకలాపాలను జరగకుండా తరిమికొడతామని అమె పేర్కొన్నారు.

ఇక పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తమ ఎమ్మెల్యే పదవికి తక్షణం రాజీనామా చేసి మన్యం వదిలి వెళ్లిపోవాలని కూడా ఆ లేఖలో అరుణ అల్టిమేటం జారీ చేశారు. అలా కనుక జరగకపోతే మన్యం ప్రజలే ఆమెను తరిమికొడతారని పేర్కొన్నారు.

అదే విధంగా ప్రజా కోర్టులో కఠినంగా ప్రజలే శిక్షిస్తారని అన్నారు. పాడేరు ఎమ్మెల్యే మన్యం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బాక్సైట్ మాఫియాకు కనుక మద్దతు ఇస్తే మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలకు వేసిన మరణ దండన లాంటి శిక్షలు వీయకతప్పదని కూడా స్పష్టం చేశారు.

మొత్తానికి చూస్తే దాదాపు నాలుగేళ్ల కాలం తరువాత మావోలు మరోమారు విశాఖ మన్యంలో గర్జిస్తున్నారు. తమ మాట వినని వారికి మరణ శాసనం రాస్తామని అంటున్నారు. పాడేరు, అరకులలో గతంలో ఎందరో ప్రజా ప్రతినిధులు మావోల ఘాతుకాలకు బలి అయ్యారు.

చాలామంది ప్రజా ప్రతినిధులు సైతం అశువులుబాసారు. ఇక ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే మావోల తూటాలకు చిక్కి మృతి చెందారు. ఇపుడు ఫస్ట్ టైం వైసీపీ ప్రజా ప్రతినిధులు మావోలకు టార్గెట్ అవుతున్నారు.

చాలా కాలం తరువాత మావోలు ఇలా బహిరంగ లేఖ రాయడం, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను రాజీనామా చేయమని కోరడంతో వైసీపి తో సహా అన్ని రాజకీయ పార్టీలలో చర్చ సాగుతోంది. ఇప్పటిదాకా టీడీపీ నాయకులు బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని చెబుతూ వస్తున్నా వైసీపీ నేతలు కొట్టిపారేసేవారు.

అయితే అదే నిజమని ఇపుడు మావోలు కూడా అంటున్నారు. దాంతో అధికార పార్టీ ఆత్మరక్షణలో పడినట్లు అయింది. మొత్తానికి మావోల హెచ్చరిక మాత్రం వైసీపీ వెన్నులో చలి పుట్టిస్తోంది. దీని మీద అధికార పార్టీ ఈ విధంగా స్పందిస్తుందో చూడాలి.

అదే విధంగా విశాఖ ఏజెన్సీలో మావోల ఉనికి లేదని భావిస్తున్న పోలీసులకు కూడా ఇది పెను సవాల్ గానే భావిస్తున్నారు. మరి దీనిని ఈ విధంగా తీసుకుని పోలిసులు ముందుకు సాగుతారు అన్నది చూడాలి.