Begin typing your search above and press return to search.

ఇద్దరు సీఎంలకు ఒకేసారి వార్నింగ్

By:  Tupaki Desk   |   30 Oct 2016 6:29 AM GMT
ఇద్దరు సీఎంలకు ఒకేసారి వార్నింగ్
X
ఇద్దరు సీఎంలు అనగానే చంద్రబాబు - కేసీఆర్ లే గుర్తుకొస్తారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు. కానీ... ఇక్కడ ఇద్దరు సీఎంలంటే వారిద్దరు కాదు... అందులో ఒకరు చంద్రబాబే అయినా రెండో సీఎం మాత్రం కేసీఆర్ కాదు. నవీన్ పట్నాయక్.. ఒడిశా ముఖ్యమంత్రి. అవును.. ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్ లకు తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏవోబీలో ఎన్ కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు వారిద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

ఎప్పటికప్పుడు మావోల ప్లీనరీలపై కోవర్టులతో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పులకు తెగబడుతున్నాయని... కేంద్ర కమిటీ నేత ప్రతాప్ ఓ లేఖ విడుదల చేసారు. 1993లో కరీంనగర్‌ లో జరిగిన ఎన్‌ కౌంటర్ - 97లో నిజామాబాద్ - 98 - 2016లో ఎఒబిలో మావోలను కోవర్టుల వ్యూహంతో మట్టుబెట్టిన ప్రభుత్వాలు - పాలకులపై ప్రతీకారం తీర్చుకుంటామని అందులో హెచ్చరించారు. ఆంధ్రా - ఒడిశా ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయిక్ - నారా చంద్రబాబునాయుడు ఈ ఎన్‌ కౌంటర్‌ కు మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర కమిటీ అల్టిమేటం ఇచ్చింది.

బాక్సైట్ తవ్వకాలు - మన్యంలో ఖనిజసంపదను కొల్లగొట్టేందుకే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు దిగుతున్నాయని.. కోవర్టు వ్యవస్థతో మావోలపై దాడులకు దిగుతున్న వారిపై ప్రతీకార చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో మావోల సేఫ్టీ జోన్స్ తెరుచుకునే వ్యూహానికి పదునుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. తువ్వ కొండలు - మహేంద్రగిరులతోపాటు తూర్పుకనుముల్లో నీరు ప్రవహించే మార్గంలో మావోల వ్యూహానికి రంగం సిద్ధమవుతున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే రాష్ట్ర హోంశాఖకు సమాచారం పంపినట్టు తెలిస్తోంది. ఒడిశా సరిహద్దుల్లో తూర్పు కనుమల్లో ఉన్న మెళియాపుట్టి - మందస - వజ్రపుకొత్తూరు - భామిని - కొత్తూరు - సీతంపేట వంటి మావో ప్రభావిత ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లో కూడా స్పెషల్ పోలీసుల బెటాలియన్‌ లు పూర్తిస్థాయిలో పహారా ఉండేలా రెడీ అవుతున్నాయి. ఆ ప్రాంతాల ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తున్నారు. ఇద్దరు సీఎంలకు ఒకేసారి గట్టి వార్నింగ్ ఇవ్వడంతో మావోయిస్టులు ఏదైనా దాడులకు తెగబడే ప్రమాదముందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/