Begin typing your search above and press return to search.

మావోల‌కు ఎన్ కౌంట‌ర్ స్థాయి అటాక్ ఇది

By:  Tupaki Desk   |   18 Nov 2016 10:46 AM GMT
మావోల‌కు ఎన్ కౌంట‌ర్ స్థాయి అటాక్ ఇది
X
ఇటీవల మల్కాన్‌ గిరిలో జరిగిన భారీ ఎన్‌ కౌంటర్‌ తో కుదేలైన మావోయిస్టు పార్లీకి తాజాగా `క్యాష్‌ కౌంటర్‌ కు గురైంది. 31మంది మావోలను కోల్పోయిన పార్టీ షాక్‌ లో ఉన్న తరుణంలో బడా నోట్ల రద్దుతో షాక్‌ మీద షాక్‌ ఇచ్చినట్లయ్యింది. వ్యాపారులు - పారిశ్రా మిక వేత్తల నుంచి విరాళాలు - బలవంతపు వసూళ్లతో మావోయిస్టులు నిధులు సమకూర్చుకోవడం అంద‌రికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సంచలన రీతిలో రూ.500 - రూ.1000 నోట్లను ఆకస్మికంగా రద్దుచేయడంతో మావోయిస్టులతోపాటు ఇతర నక్సలైట్‌ గ్రూపులు ఒక్కసారిగా షాక్‌ కు గురయ్యాయన్నది సమాచారం. రూ. 500 - 1000 పాత నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్ర‌మంలో వారు వేసిన ఎత్తుల‌కు కొత్త చిక్కులు వ‌చ్చిప‌డుతున్నాయ‌ని గిరిజ‌నులు అంటున్నారు.

మావోలు తమ వద్ద ఉన్న బడా నోట్లను చెలామణి చేస్తున్న క్రమంలో పట్టుబడుతున్నారని జార్ఖండ్‌ పోలీసులు పేర్కొంటున్నారు. వివిధ రూపాల్లో వసూళ్ల ద్వారా సేకరించిన డబ్బును ఆదివాసీ గిరిజనుల సహాయంతో మార్చుకునేందుకు నక్సలైట్లు ప్రయత్నిస్తున్నట్లు, ఈ క్రమంలో కొందరు చట్టానికి చిక్కినట్లు లతెహార్‌(జార్ఖండ్‌) ఎస్పీ అనూప్‌ బిర్తరే మీడియాకు వెల్లడించారు. జార్ఖండ్‌ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన లతెహార్‌ - చుట్టుపక్కల జిల్లాల్లో నక్సలైట్ల నోట్ల మార్పిడిపై నిఘా పెంచామని ఎస్పీ పేర్కొన్నారు. బ్యాంకులో జమచేసే మొత్తంపై ఆంక్షలున్న నేపథ్యంలో గిరిజనుల ద్వారా నక్సలైట్లు నగదును మార్చుకుంటున్నారని తెలిసింది. కనీసం నోటు విలువను కూడా చెప్పలేని ఓ గిరిజన మహిళ రెండు రోజుల కిందట లతేహార్‌ లోని ప్రభుత్వ బ్యాంకుకు వచ్చి.. తన జనధన్‌ ఖాతాలో రూ.4.5 లక్షలు జమ చేసేందుకు ప్రయత్నించిందని, అయితే బ్యాంక్‌ అధికారులు పాన్‌ కార్డు అడగటంతో కంగారుపడిన ఆమె.. డిపాజిట్‌ చేయకుండానే వెనుదిరిగి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మావోయిస్టు అనుబంధంగా అసోంలో పనిచేస్తున్న నక్సలైట్‌ గ్రూపు కూడా నోట్ల మార్పిడికి విఫలయత్నం చేసిందని, ఈ క్రమంలో భారీ నగదు కలిగి ఉన్న ఇద్దరిని అరెస్‌‌ట చేశారని పోలీసులు పేర్కొన్నారు. నక్సలైట్లు పలువురిని బెదిరించి, బలవంతపు వసూళ్ల ద్వారా డబ్బు సేకరిస్తారు కనుక అలాంటి సొమ్మును మార్పిడి చేసేందుకు సహకరించేవారు కూడా నేరస్తులే అవుతారని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివారిని వదిలిపెట్టబోమని పోలీసులు అంటున్నారు.

ఇదిలాఉండ‌గా నోట్ల కష్టాల నుంచి గట్టెకేందుకు నక్సలైట్లు గిరిజనులనే కాక కమిషన్‌ ఏజెంట్లను సైతం సంప్రదిస్తున్నట్లు సమాచారం. 20 లేదా 30 శాతం కమిషన్‌ తీసుకుని నక్సలైట్ల దగ్గరున్న పాత నోట్లు మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తమకు ఆధారాలు లభించాయని, దీంతో జిల్లా వ్యప్తంగా తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ అనూప్‌ చెప్పారు. ఇదిలాఉండ‌గా పెద్ద నోట్ల రద్దుతో ఉగ్రవాద చర్యలు - నక్సలైట్ల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తెలిపారు. రాజ్ నాథ్‌ సింగ్ మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో ఇబ్బందులున్న మాట నిజమేనని, అయితే ప్రజలు కొంతకాలం సహనంగా ఉంటే చాలని చెప్పారు. దేశం నుంచి అవినీతి నిర్మూలించే అవకాశం దక్కుతుందని, భారత ఉజ్వల భవిష్యత్తుకు మార్గం ఏర్పడుతుందని చెప్పారు. తమ పాలనలో భారతమాత కీర్తికి మచ్చ తీసుకురాబోమని స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/