Begin typing your search above and press return to search.

కబ్జాలు చేస్తే శిక్షిస్తాం: టీఆర్ఎస్ కు మావోయిల హెచ్చరిక

By:  Tupaki Desk   |   14 Feb 2020 8:30 AM GMT
కబ్జాలు చేస్తే శిక్షిస్తాం: టీఆర్ఎస్ కు మావోయిల హెచ్చరిక
X
అనాది గా దున్నే వాడికే భూమి ఉండాలనే డిమాండ్ తో మావోయిస్టుల దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అడవుల్లో కూర్చొని సమసమాజ స్థాపన కోసం పని చేస్తుంటారు. అలాంటి వారు పేదల భూములు, ప్రభుత్వ భూములు కబ్జా గురయితే వెంటనే స్పందించి వారు రంగంలోకి దిగుతారు. ముఖ్యంగా వారు భూ పోరాటాలు సాగిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు ఆగడాలు చేస్తున్నారని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కబ్జాలకు పాల్పడే నాయకులు మారకపోతే శిక్ష తప్పదని హెచ్చరిస్తూ లేఖలు విడుదల చేయడంతో కలవరం మొదలైంది.

టీఆర్ఎస్ నేతలకు మావోయిస్టు పార్టీ హెచ్చరికలు కలకలం సృష్టిస్తున్నాయి. భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, పద్దతులు మార్చుకోక పోతే శిక్ష తప్పదని మావోయిస్టులు హెచ్చరించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ నేత వెంకటేశ్ పేరుతో లేఖ విడుదలైంది. గతం లో కూడా టీఆర్ఎస్ నాయకులకు ఇలాంటి లేఖలు వచ్చాయి. అయితే రాష్ట్రంలో నక్సలైట్లు లేరని, వారు మకాం మార్చారని ఇన్నాళ్లు పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు లేఖలు విడుదల కావడంతో కలకలం రేగింది.

ఎన్నికల సమయంలో మావోయిస్టుల అజెండానే మా పార్టీ విధానం, నేను పెద్ద మావోయిస్టుని అని కేసీఆర్ ప్రకటించారు. అయితే కేసీఆర్ పాలన ఆ విధంగా లేదని దొరల పాలన, గడీల పాలన ఉందని మావోయిస్టులు ఆరోపిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగడం లేదని, భూములు కబ్జాకు పాల్పడుతూ టీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. అలాంటి వారిని శిక్షిస్తామని మావోయిస్టులు బహిరంగ లేఖలు విడుదల చేయడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. మళ్లీ మావోల అలజడి పెరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ లేఖలతో టీఆర్ఎస్ నాయకులు జాగ్రత్త పడడంతో పాటు పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ లో మావోయిస్టులు ఉండేవారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టే అవకాశం ఉంది.