Begin typing your search above and press return to search.

తెలుగు రాజకీయాలను మార్చేసిన మార్చి

By:  Tupaki Desk   |   29 March 2022 7:30 AM GMT
తెలుగు రాజకీయాలను మార్చేసిన మార్చి
X
తెలుగు రాజకీయాల్లో మార్చి నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మార్చి నెల రాజకీయంగా కొన్ని పార్టీలకు బర్త్ మంత్. యాధృచ్చికంగా జరిగిందో లేక సెంటిమెంట్ గా అనుకున్నారో తెలియదు కానీ తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసిన మూడు ప్రధాన పార్టీలు మార్చిలోనే పుట్టాయి. ఆ మూడూ ఇపుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉండడం విశేషం. ముందు ఆ పార్టీలు ఏంటో, ఆ కధా కమామీషూ ఏంటో చూద్దాం.

అది 1982 మార్చి నెల 29వ తేదీ. ఎన్టీయార్ నాడు తెలుసు సినిమాల్లో నంబర్ వన్ హీరో. ఒక్కో సినిమాకు ఇరవై లక్షల రూపాయలు ఆయన తీసుకునేవారు అని చెప్పుకునే వారు. ఎన్టీయార్ కి రాజకీయాల మీద ఎపుడూ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు, కానీ ఆయనకు సమాజ సేవ మీద మాత్రం అనురక్తి ఎక్కువ.

ఆయన అలా తెలుగు ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు అనేక కార్యక్రమాలు చేపట్టి ఆదుకున్నారు. ఇక ఎన్టీయార్ 1980 ప్రాంతంలో సర్దార్ పాపారాయుడు సినిమా చేస్తున్నారు. దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా దేశ భక్తి కధాంశంగా ఉంటుంది. దాంతో ఆ సినిమాలో అల్లూరి గెటప్ లో ఉండగా ఎన్టీయార్ కి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక తొలిసారి పుట్టింది.

అల్లూరిని ఇన్నేళ్ళు అయినా స్మరించుకుంటున్నాం అంటే ఆయన చేసిన దేశ సేవ కాబట్టి అని భావించిన ఎన్టీయార్ తానూ అలా చిరస్థాయిగా నిలవాలని అనుకున్నారు. ఆ విధంగా ఆయనలో పుట్టుకు వచ్చిన ఒక కోరిక సాకారం అయ్యేసరికి 1982 పట్టింది. మార్చి 29న ఆయన హైదరాబాద్ వచ్చి పార్టీని ప్రకటించారు. అలా టీడీపీ ఎంతటి ప్రఖ్యాతి సాధించిందో అందరికీ తెలిసిందే.

ఇక టీడీపీ పుట్టిన మూడు దశాబ్దాల తరువాత అంటే 2011లో మార్చి నెల 12న వైఎస్సార్ సీపీ పుట్టింది. ఈ పార్టీని వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రారంభించారు. ఆయన 2009 ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ ఎంపీగా కడప నుంచి గెలిచారు. ఆ తరువాత వైఎస్సార్ అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, కాంగ్రెస్ తో జగన్ కి విభేదాలు రావడంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట పార్టీని పెట్టారు.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పుడుతూనే ఎన్నో సంచలనాలు నమోదు చేసింది. అప్పటికి బలమైన పార్టీగా ఉన్న టీడీపీని 2011 మే లో జరిగిన కడప లోక్ సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలలో ఢీ కొట్టి ఘన విజయాలు అందుకుంది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వైసీపీ విజయఢంకా మోగించింది. 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా చేరువ దాకా వచ్చి బలమైన ప్రతిపక్షం అయింది. ఇక 2019 ఎన్నికల్లో 151 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టి గత మూడేళ్ళుగా ఏపీలో అధికార పార్టీగా కీలకమైన భూమిక పోషిస్తోంది.

ఇక ముచ్చటగా మూడవ పార్టీ కూడా మార్చిలోనే పుట్టింది. ఆ పార్టీ జనసేన. దాని అధినేత పవన్ కళ్యాణ్. ఉమ్మడి ఏపీ విభజనతో ఆయన మనసు రగిలి తెలుగు వారి కోసం ఒక పార్టీ అవసరం అని జనసేనను 2014 మార్చి 14న ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోయినా బీజేపీ, టీడీపీలకు మద్దతు ప్రకటించి ఆ రెండు పార్టీలూ ఏపీలో అధికారంలోకి వచ్చేలా జనసేన కీలక పాత్ర పోషించింది.

ఇక 2019 ఎన్నికల్లో జనసేన ఒక సీటు ఆరు శాతం ఓట్లు సంపాదించుకుని తన పాత్రను నిలబెట్టుకుంది. 2024 ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వస్తామని జనసేన ఇపుడు గట్టిగానే చెబుతోంది. ఏపీ రాజకీయాల్లో టీడీపీ వైసీపీ తరువాత జనాలు చూసేది ఆలోచించేది జనసేన గురించే అంటే అతిశయోక్తి కాదు. మొత్తానికి చూసుకుంటే తెలుగు రాజకీయాల్లో మూడు ప్రాంతీయ పార్టీలు మార్చి నెలలోనే పుట్టాయి. అవి ఈ రోజుకీ తెలుగు రాజకీయాలను ప్రభావితం చేయడం విశేషం.