Begin typing your search above and press return to search.

బిగ్ బ్ర‌ద‌ర్‌.. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: మార్గ‌రెట్ సంచ‌ల‌న కామెంట్‌

By:  Tupaki Desk   |   26 July 2022 10:30 AM GMT
బిగ్ బ్ర‌ద‌ర్‌.. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు:  మార్గ‌రెట్ సంచ‌ల‌న కామెంట్‌
X
విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి, మాజీ గ‌వ‌ర్న‌ర్‌.. మార్గ‌రెట్ ఆళ్వా.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లుచేశారు. కేంద్రం త‌న ఫోన్‌ల‌ను ట్యాప్ చేస్తోంద‌ని.. తాను ఏం మాట్లాడినా.. కేంద్రం వింటోంద‌ని.. ఆమె ఆరోపించారు. కేంద్రం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతోం దని.. రాజకీయ నేతలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ కేంద్రానికి తెలుసని అన్నారు.

ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తి రేసులో ఉన్న ఆళ్వాకు బీజేపీలోనూ స్నేహితులు ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆమెత‌న‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని కోరుతూ.. బీజేపీలోని తన స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడాక తన కాల్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయనేది ఆళ్వా ప్ర‌ధాన ఆరోప‌ణ‌. న్యూ ఇండియాలో రాజకీయ నాయకులు ఇతర పార్టీ నేతలతో మాట్లాడాలంటే భయపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

'బిగ్బ్రదర్`(మోడీ)కు అన్నీ తెలుస్తాయన్న భయం బీజేపీ నేత‌ల‌కు కలుగుతోందని, త‌న‌తో స‌రిగా మాట్లాడ‌డం లేద‌ని.. పైగా రెండు, మూడు ఫోన్లు వాడుతూ ఎప్పటికప్పుడు సిమ్ కార్డులు మార్చుతున్నా రని ఆళ్వా అన్నారు. అంతేకాదు కలిసినప్పుడు కూడా గుసగుసలాడుకుంటూనే మాట్లాడుకుంటారని వ్యాఖ్యానించార‌రు. భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంద‌ని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఎంటీఎన్ఎల్ సంస్థ నోటీసు పంపిన ఫొటోను షేర్ చేశారు ఆళ్వ. కేవైసీ సస్పెండ్ చేస్తున్నామని, మరో 24 గంటల్లో సిమ్ కార్డును బ్లాక్ చేస్తామని నోటీసులో ఉంది. అయితే ఇవి నకిలీ నోటీసులు అంటూ అంతకుముందే ఢిల్లీ పోలీసులు హెచ్చరించడం గమనార్హం. ఎంటీఎన్ఎల్ పేరు, లోగోను దుర్వినియోగం చేసి వాట్సాప్లో ఈ తరహా ఫ్రాడ్ మెసేజులు వస్తుంటాయని తెలిపారు. ఇది కేవైసీ స్కామ్లో ఒక రకమని తెలిపారు

మ‌రోవైపు.. మార్గ‌రెట్ ఆళ్వా ఆరోపణలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తోసిపుచ్చారు. ఆమె ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుస్తారన్న నమ్మకం ఉందన్నారు.

ఆళ్వా చేసే ఆరోపణల్లో అర్థం లేదని.. ఓ సీనియర్ నేత అయ్యి ఉండి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. కాగా.. ఈ ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు ఇంకా స్పందించాల్సి ఉంది.