Begin typing your search above and press return to search.

కోవిడ్ టీకా వేసుకున్న తొలి మహిళ ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   8 Dec 2020 2:02 PM GMT
కోవిడ్ టీకా వేసుకున్న తొలి మహిళ ఎవరో తెలుసా?
X
ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ వచ్చేసింది. నిన్నమొన్నటివరకు వ్యాక్సిన్ మీద ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వ్యాక్సిన్ ను బ్రిటన్ లో ఈ రోజు నుంచి ఇవ్వటం షురూ చేశారు. ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ వేయించుకున్న మహిళగా 90 ఏళ్ల బామ్మ నిలిచింది. దీంతో.. ఇప్పటివరకు పెద్ద ఫజిల్ గా మారిన కరోనాకు సొల్యూషన్ దొరికినట్లే. ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఫైజర్ తన టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజున బ్రిటన్ లో షురూ చేసింది.

బ్రిటన్ కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 6.30 గంటల సమయంలో సెంట్రల్ ఇంగ్లండ్ లోని కోవెంట్రీలోని వర్సిటీ ఆసుపత్రిలో 90 ఏళ్ల మార్గరెట్ కీనన్ తొలి టీకా వేయించుకున్నారు. ఫైజర్ టీకాకు క్లీనికల్ అనుమతి లభించిన నేపథ్యంలో ఆమెకు తొలి టీకా వేశారు. దీంతో.. అధికారికంగా తొలి టీకాను వేయించుకున్న మొదటి మహిళగా 90 ఏళ్ల బామ్మ నిలిచారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఈ బామ్మ మరో వారంలో 91వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు.

తన పుట్టినరోజుకు కాస్త ముందుగా అందిన గొప్ప బహుమతి కోవిడ్ 19 వ్యాక్సిన్ గా ఆమె పేర్కొన్నారు. ఏడాదిగా తాను చాలాకాలం పాటు ఒంటరిగా గడిపానని.. త్వరలోనే తన కుటుంబం..స్నేహితుల్ని కలిసి సమయాన్ని గడపనున్నట్లుగా చెప్పారు. జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ తో కలిసి ఫైజర్ ఈ వ్యాక్సిన్ ను డెవలప్ చేసింది. అత్యవసర వినియోగానికి యూకే సర్కారు అనుమతి ఇచ్చింది.

వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ప్రమాదం పొంచి ఉన్న ఆరోగ్య సిబ్బందికి.. 80 ఏళ్ల వయసు పైబడిన పెద్ద వయస్కులకు.. కేర్ హోంలో ఉండే వర్కర్లకు తొలుత ఇవ్వనున్నారు. గ్రేట్ బ్రిటన్ తో పాటు.. అమెరికాలోనూ అత్యవసర వినియోగానికి ఫైజర్ అప్లికేషన్ పెట్టుకుంది. ఇంకా అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. తాజా పరిణామంతో.. కరోనాకు చెక్ పెట్టే టీకా వచ్చేసినట్లే. ఇక.. మన దేశానికి ఎప్పటికి వస్తుందో చూడాలి.