Begin typing your search above and press return to search.

అది గంజాయివనం...ఎందరో కారణం...?

By:  Tupaki Desk   |   26 Oct 2021 10:43 AM GMT
అది గంజాయివనం...ఎందరో కారణం...?
X
గంజాయివనం అంటారు. అవును గంజాయి మొక్కలు ఉన్న చోట మరేదీ కనిపించదు. అక్కడ కనుక తులసి మొక్క ఉంటే కూడ పవిత్రంగా భావిస్తారు. ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గంజాయి గురించే. ఆంధ్ర రాష్టంలో ఏకంగా 23 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతోందని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కి ఇచ్చిన వినతిపత్రంలో టీడీపీ ఫిర్యాదు చేసింది. గంజాయి ఏపీ నుంచే దేశానికి పెద్ద ఎత్తున రవాణా అవుతోంది అని కూడా ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇక దేశంలో ఎక్కడ గంజాయి రవాణా జరిగినా పట్టుబడినా దాని మూలాలు విశాఖ జిల్లాలో ఉన్నాయని కూడా అంటున్నారు. ఏవోబీ అంటే ఆంధ్రా ఒడిషా బోర్డర్ ప్రాంతంలో వేల ఎకరాల్లో గంజాయి సాగు పెద్ద ఎత్తున సాగుతోంది అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇది ఇవాళా నిన్నా జరిగినది కాదు, ఎన్నో ఏళ్ళుగా ఈ సాగు జరుగుతోంది అంటున్నారు.

గతంలో టీడీపీ హయంలో కూడా ఇలాగే పరిస్థితి ఉండేది. అప్పట్లో అంటే 2017లో నాటి టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ విశాఖ గంజాయి కి అడ్డా అని చెప్పేశారు. ఎందరో పెద్దలు దీని వెనకాల ఉన్నారని కూడా ఆయన ఆరోపించారు. నాడు ఇదే విషయం మీద టీడీపీ మంత్రివర్గ సమావేశంలో చర్చ సాగింది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే అంతకు ముందు కేజీల లెక్కన రవాణా అయితే ఆ తరువాత కాలంలో టన్నుల కొద్దీ రవాణా అవుతోందని కూడా గంటా చెప్పారు. నాడు గంటా ఏమేమి మాట్లాడారో ఆ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంటే గంజాయి సాగు వేల ఏకరాల్లో పంట. పెద్ద ఎత్తున రవాణా అన్నది కేవలం వైసీపీ పాపం కానే కాదు అన్నది మాజీ మంత్రి నాటి వీడియో బట్టి తెలుస్తోంది. అదే విధంగా నాడు కొందరు అధికార పార్టీకి చెందిన వారు ఈ గంజాయి సాగు వెనక, అక్రమ రవాణా వెనకా ఉన్నారని కూడా విమర్శలు ఉన్నాయి.

మరి ఇంతలా గంజాయి సాగు ఉంటే నాడు టీడీపీ సర్కార్ ఏం చేసింది అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఇపుడే కళ్ళు తెరచినట్లుగా, ఈ రెండేళ్లలోనే ఏదో నేరాలూ ఘోరాలూ ఎక్కువ అయ్యాయని టీడీపీ తమ్ముళ్ళు పొలికేకలు పెట్టడం అంటే అది కచ్చితంగా రాజకీయం తప్ప మరేమీ కాదని అంటున్నారు. నిజానికి గంజాయి సాగు వెనక పెత్తందార్లు చాలా మంది ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.ఇది పెద్ద వ్యాపారంగా మారిందని, ఇందులో చాలా మంది పెద్దలు కూడా ఉన్నారని అంటున్నారు. ఎపుడూ కూడా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగవు. మరి వారి విషయంలో చర్యలకు ఎవరైనా సిద్ధపడితేనే ఈ గంజాయి సాగు, రవాణాకు అడ్డుకట్ట పడుతుందని మేధావులు అంటున్నారు.

మొత్తానికి విశాఖ ఏజెన్సీ గంజాయికి అతి ముఖ్య స్థావరం అన్నది బహిరంగ రహస్యమే అంటున్నారు. గంజాయిని అతి పెద్ద బిజినెస్ గా మార్చుకున్న వారు కనిపిస్తారు. అలాగే నెట్ వర్క్ కూడా గట్టిగానే దీని వెనక ఉందని చెబుతున్నారు. మరి ఇంతలా గంజాయి వ్యాపారం విస్తరణ అన్నది ఒకటి రెండేళ్లలో జరిగే వ్యవహారం కాదని కూడా అంటున్నారు. వారూ వీరూ అని కాకుండా బిగ్ షాట్స్ అంతా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, ఆ సంగతి ఆరోపణలు చేసిన వారికీ తెలుసు అంటున్నారు. మరి గంజాయి పాపమేదో ఒక పార్టీ మీదనో, ఒకరి మీదనే నెట్టేసి చేతులు దులుపుకుందామని, గంజాయి నుంచి రాజకీయ పంట పండించుకుందామని చూడడమే దారుణం అంటున్నారు. ఈ విషయంలో కచ్చితంగా అంతా ఒక త్రాటి మీదకు వస్తేనే తప్ప ఈ మహమ్మారిని తరిమేయడం సాధ్యపడదు అంటున్నారు.