Begin typing your search above and press return to search.

హ‌వ్వ‌..భ‌ర్త‌తో క‌లిస్తే రేప్ కేసేంటి?

By:  Tupaki Desk   |   12 March 2016 5:59 AM GMT
హ‌వ్వ‌..భ‌ర్త‌తో క‌లిస్తే రేప్ కేసేంటి?
X
కాలం మారిపోతోంది. చ‌ట్టం అన్యాయాల‌ను అరిక‌ట్టేందుకే కాకుండా అగ్ర‌హావేశాల ఆధారంగా ఎదుటివారిని ఇబ్బందిపెట్ట‌డానికి కూడా అక్కర‌కు వ‌స్తోంది. తాజాగా అత్యాచారం కేసుల విష‌యంలోనూ ఈ డిమాండ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆడ‌వారి ప‌ట్ల అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రించే రాక్ష‌సులు ఉన్నార‌నేది నిజం. అయితే భ‌ర్త‌ను వేధించేందుకు "అత్యాచారం" కేసు పెట్టే మ‌హిళ‌లు కూడా ఉన్నార‌ట‌. అలా భ‌ర్త‌కు చుక్క‌లు చూపించేందుకు అత్యాచారం కేసు పెట్టే అవ‌కాశం ఇవ్వాల‌ని సాక్షాత్తు రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. అయితే దీనిపై మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ వాస్త‌విక ఆలోచ‌న‌తో స్పందించారు.

"వైవాహిక అత్యాచారం"పై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో మేన‌కాగాంధీ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. వివాహ సంబంధంతో ఒక్కటైన జంట మధ్య అత్యాచారం కేసు పెట్టే విధానం మన దేశానికి సరిపడదని ఆమె అన్నారు. మత విశ్వాసాలు - వివాహ బంధం - సామాజిక ఆచారాలు - పెళ్ళిపై సమాజంలో ఉన్న అభిప్రాయం తదితర అంశాల‌ కారణంగా భ‌ర్త అంటే భాగ‌స్వామి అనే భావ‌న ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. భార్యపై భర్త లైంగిక చర్యను నేరమని చెప్పటం సరికాదని ఆమె ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. అంతర్జాతీయంగా ఉన్న అవగాహన మన దేశంలో లేదన్నారు.
పెళ్ళయిన జంటల్లో కూడా కొంత మంది భర్తలు భార్య ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా లైంగిక చర్యలకు పాల్పడటం జరుగుతుంటుంది. ఇలాంటి కేసుల్లో కొంతమంది తమ తమ భర్తలపై రేప్‌ కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వివిధ దేశాల్లో ఇలాంటి కేసుల‌కు శిక్ష‌లు కూడా విధించిన ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో చర్చ కూడా సాగుతోంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో కేసు కూడా న‌మోద‌యింది.