Begin typing your search above and press return to search.

దేశద్రోహం కేసు పెట్టినా వెటకారం ఆపలేదు!

By:  Tupaki Desk   |   29 Sep 2016 4:32 AM GMT
దేశద్రోహం కేసు పెట్టినా వెటకారం ఆపలేదు!
X
వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో తనదైన మార్కు చూపించడం - ఫలితంగా నిత్యం వార్తల్లో నిలవడం ఈ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కి బాగా అలవాటు! ఇంత సీనియర్ సిటిజన్ - పైగా సుప్రీంలోర్టు మాజీ న్యాయమూర్తి హోదాలో తాను మాట్లాడిన మాటవల్ల దేశానికి ఏమి ప్రయోజనం అని ఆలోచిస్తారా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే, రచ్చ రచ్చ మాత్రం చేస్తారు. తాజాగా కశ్మీర్ కావాలంటే బీహార్ ను కూడా తీసుకొండని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మార్కండేయ కట్జూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఈయనపై దేశద్రోహం కేసు కూడా నమోదైంది. అయినా కూడా ఈ పెద్దాయన సెటైర్లు ఏమాత్రం ఆపలేదు!

బిహార్‌ను తీసుకుంటామనే కండిషన్ మీద కశ్మీర్‌ ను పాకిస్థాన్‌ కు ఇచ్చేందుకు సిద్ధమని - కశ్మీర్‌ ను బిహార్‌ తో కలిపి ఒక స్పెషల్ ప్యాకేజీగా ఇస్తామని, బిహార్‌ వద్దంటే మాత్రం కశ్మీర్‌ ను కూడా ఇవ్వబోమని జస్టిస్‌ కట్జూ తీవ్ర వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బిహార్‌ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సహా పలువురు నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే ఈ సీఎం వ్యాఖ్యలపై కూడా వెటకారమాడారు కట్జూ. "బీహార్‌ కు నేను అమ్మనా - నాన్ననా అని నితీశ్‌ ప్రశ్నిస్తున్నారు.. బిహార్‌ కు నేను అమ్మను కాదు నాన్నను కాదు కానీ శకుని మామను" అంటూ కట్జూ పేర్కొన్నారు. "వస్త్రాపహారణం జరుగుతుంటే - ద్రౌపది గౌరవాన్ని కాపాడుకునేందుకు కృష్ణుణ్ని ప్రార్థించింది" అంటూ పరోక్షంగా (నితీశ్‌ పై) విమర్శనాస్త్రాలు సంధించారు.

కాగా బిహార్‌ పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూపై దేశద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. అధికార జేడీయూ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు శాస్త్రి నగర్‌ పోలీసు స్టేషన్‌ లో ఆయనపై సెక్షన్‌ 124 ఏ కింద దేశద్రోహం కేసు నమోదైంది. ఈస్థాయి కేసుపెట్టిన కూడా 'కేసులు ఈ ఫేసుకి కొత్తకాదురా' అన్నట్లో ఏమో కానీ... కావాలంటే బిహారీలు తనపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయవచ్చునని చమత్కరించారు ఈ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి!!