Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ‌కు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌.. జ‌గ‌న్ ప్లాన్ ఇదే..!

By:  Tupaki Desk   |   11 Jan 2022 12:30 AM GMT
రాజ్య‌స‌భ‌కు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌.. జ‌గ‌న్ ప్లాన్ ఇదే..!
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన నేతలకు... హామీలు ఇవ్వని నేతలకు కూడా ఎన్నో కీలక పదవులు కట్టబెట్టారు. ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్సీలు ఇచ్చారు. అయితే ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన ఒక నేతకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తానని ఓపెన్ గా చెప్పారు. అలాంటి నేతకు జగన్ ముఖ్యమంత్రి అయి మూడు సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆ నేత ఎవరో కాదు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ గత ఎన్నికల్లో విడ‌దల రజనీ కోసం తన సీటు వదులుకున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మర్రిని ఎమ్మెల్సీని చేసి క్యాబినెట్ లో తన పక్కన కూర్చోబెట్టు కుంటానని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నోసార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ప్రతిసారి మర్రికి ఎమ్మెల్సీ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది తప్ప... ఆయనకు పదవి రావడం లేదు.

ఇటీవల గుంటూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో మ‌ర్రికి ఎమ్మెల్సీ ఇచ్చేస్తానని జగన్ కొద్ది రోజుల క్రిందట మాట ఇచ్చారు. అయితే అనూహ్యంగా టిడిపి నుంచి వచ్చిన మారుగుడు హనుమంతరావుకు బీసీ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి మర్రికి మరోసారి మొండిచేయి చూపారు. దీంతో కోస్తా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నేతల్లో వైసీపీపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇదే జిల్లా నుంచి గత ఎన్నికలకు ముందు వైసీపీలో కీలక పాత్ర పోషించిన మరో ముగ్గురు కమ్మ సామాజిక వర్గ మాజీ ఎమ్మెల్యేలకు సైతం ఇప్పుడు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. వీళ్లంతా కమ్మ వర్గానికి చెందిన వారు కావడంతోనే జగన్ పక్కన పెట్టిన‌ట్టు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి జగన్ వ్యూహాత్మకంగా చెక్ పెడుతున్నట్టు తెలుస్తోంది.

రాజ్య‌స‌భ‌కు మ‌ర్రి...?
జగన్ మండలిని రద్దు చేస్తాం అని నిర్ణయం తీసుకున్న వెంటనే మండలి నుంచి మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ - పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపారు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేసి కేబినెట్లోకి తీసుకుంటే తన నిర్ణయానికి అర్థం ఉండదని ఆయన భావించారని... అయితే మర్రికి అన్యాయం జరగకుండా ఉండేందుకు ఆయనను జూన్‌లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నారు అంటూ వైసీపీ వర్గాల్లో ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది. వైసీపీలో రాజ్యసభకు ఎంపికైన వారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఆ పార్టీ తరఫున కమ్మ సామాజిక వర్గం నుంచి ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు.

గుంటూరు - కృష్ణా జిల్లాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే క్రమంలో మర్రి రాజశేఖర్ కు అన్యాయం చేయకుండా ఉండేందుకు ఆయనను రాజ్యసభకు పంపాలని పార్టీ సన్నిహితుల వద్ద జగన్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మర్రిని రాజ్యసభకు పంపితే ఆయనకు న్యాయం చేసినట్టు అవుతుందని నియోజకవర్గంలో రజనీకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని జగన్ భావిస్తున్నారట. ఇప్పటికే ఎన్నోసార్లు చేతిదాకా వచ్చిన పదవి చేజారడంతో నిరాశలో ఉన్న మ‌ర్రికి రాజ్యసభ ప‌ద‌వితో అయినా పునర్వైభవం వస్తుందన్న అంచనాలు వైసిపిలో ఉన్నాయి. మరి జగన్ ఈసారైనా తన నిర్ణయానికి కట్టుబడ‌తారా ? లేదా అన్నది చూడాలి.