Begin typing your search above and press return to search.

కేటీఆర్, త‌ల‌సానిపై చీటింగ్ కేసు!

By:  Tupaki Desk   |   8 July 2017 9:32 AM GMT
కేటీఆర్, త‌ల‌సానిపై చీటింగ్ కేసు!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడైన మంత్రి కేటీఆర్‌ - ఆయ‌న స‌హ‌చ‌ర అమాత్యుడైన త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ పై చీటింగ్ కేసు న‌మోదు చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత మ‌ర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. పేద ప్ర‌జ‌ల‌కు బూట‌క‌పు హామీలు ఇచ్చి వారిని మోసం చేస్తున్నందుకు ఈ ఇద్ద‌రు మంత్రుల‌పై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం చేస్తే కాలుష్యం అవుతుందని నిమజ్జనం కోసం అంబేడ్కర్ నగర్ లో కొలను కట్టిస్తామని చెప్పి 70 శాతం ఇండ్లు ఖాళీ చేయించారని మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి తెలిపారు. తీరా అక్కడ ఇండ్లు కాకుండా చెరువు కట్టించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇది ప్రజలను మోసం చేయడమేన‌ని మండిప‌డ్డారు. అంబేడ్కర్ నగర్ లో డబుల్ బెడ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పి స్థానికుల‌ను ఖాళీ చేయించారని పేద‌ల‌ను రోడ్డున ప‌డేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇలా స్థానికుల‌ను మోసం చేసిన ఇద్ద‌రు మంత్రలు కేటీఆర్ - తలసాని ఫై చీటింగ్ కేసు పెట్టమని గతంలో రాష్ట్ర డీజీపీని కోరిన‌ట్లు మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి తెలిపారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని అన్నారు. మంత్రుల‌ఫై పెట్టిన చీటింగ్ కేసు పెట్టేవ‌ర‌కు వదలిపెట్టబోన‌ని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. సనత్ నగర్ లో ఇండ్లు కట్టుకున్న వారిని ఖాళీ చేయాలనీ జీహెచ్ఎంసీ తెల్ల కాగితం పైన నోటీసులు ఇచ్చిందని మర్రి శశిధ‌ర్ రెడ్డి తెలిపారు. ఆ స్థ‌లంలోని పేద‌ల‌ను ఖాళీ చేయించి మంత్రులు కబ్జా చేయాలనీ చూస్తున్నార‌ని మండిప‌డ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో నగర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోంద‌ని, దీన్ని ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని శ‌శిధ‌ర్ రెడ్డి అన్నారు.