Begin typing your search above and press return to search.

వైఎస్ కంటే గొప్ప‌గా ఏం చేస్తున్నావ్ కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   13 July 2017 2:03 PM GMT
వైఎస్ కంటే గొప్ప‌గా ఏం చేస్తున్నావ్ కేసీఆర్‌?
X
మూడో విడత హ‌రిత‌హారం ప్రారంభం సంద‌ర్భంగా కరీంనగర్ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలను గొర్రెలతో పోల్చడంపై సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిప‌డ్డారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌ను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామ‌ని చెప్తూనే...మండిప‌డ్డారు. గొర్రెలు కేసీఆర్ లాగా తోడేలు కాదని...అవి సాత్విక జీవుల‌ని వ్యాఖ్యానించారు. మంచి చేస్తారని గొర్రెల పంపిణీ పథకాన్ని ఆహ్వానించామే కానీ అందులోనూ లోపాలు ఉన్నాయ‌ని అన్నారు. పంపిణీకి ఎంపిక చేసిన గొర్రె - పొట్టేలులో ఏవి 6 నెలల వయసుకు మించలేదని అన్నారు. 3 లక్షల 59 వేళ యూనిట్ల‌కు కేవలం 4000 యూనిట్లు మాత్రమే మొదటి విడతలో పంపిణీ చేశార‌ని జీవ‌న్ రెడ్డి అన్నారు. అంటే కేవ‌లం ఒక్క శాతం మాత్రమే చేశారని అస‌లు ఈ ప‌థ‌కం కింద ఏం జరుగుతోందని జీవ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు.

గొర్రెల కోసం ప్ర‌భుత్వం క‌ల్పించిన వైద్య సదుపాయాలు ఏమిటని జీవ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో గాలి కుంటు వ్యాధితో గొర్రెలు చనిపోతున్నాయని... 5000 గొర్రెలు ఒక డాక్టర్ చొప్పున 1500 మంది వెటర్నరీ డాక్టర్స్ ఉండాల్సిన‌ప్ప‌టికీ అలాంటి ఏర్పాట్లు లేవ‌న్నారు. అన్ని విషయాల పై కేసీఆర్ కు లేఖ రాయ‌నున్న‌ట్లు తెలిపారు. గొర్ల పంపిణీ కూడా మరొక దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం లాగా కావొద్దని త‌మ విజ్ఞప్తి అని జీవ‌న్ రెడ్డి అన్నారు. సరైన సమయంలో చేప పిల్లల పంపిణీ చెయ్యక పోవడంతో ఆక్సిజన్ కొరత తో చేపలన్నీ చనిపోయాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ చేసినవే తప్ప అదనంగా ఎక్కడ ఒక్క‌ పథకం కూడా కేసీఆర్‌ది లేదని జీవ‌న్ రెడ్డి తెలిపారు.

ఉచిత విద్యుత్ దివంగ‌త సీఎం వైఎస్ ప్రారంభించారని, ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు మొదలు పెట్టింది వైఎస్ అని, సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.5000 ప్రోత్సాహం ఇచ్చింది కూడా వైఎస్ హ‌యాంలోనేన‌ని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఎందుకు నీరుగారుస్తున్నారో ప్ర‌భుత్వం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య శ్రీ, 108 ప‌థ‌కాల‌ను ఆనాటి సీఎం వైఎస్ అమ‌లు చేశారని గుర్తు చేశారు. ఆనాడు వైఎస్ సామూహిక ముస్లింల‌కు వివాహాలు చేశారని దాన్నే కేసీఆర్ అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు.

కాగా, హుస్సేన్‌ సాగ‌ర్ స‌మీపంలో భారీ భ‌వ‌నం నిర్మాణం విష‌యంలో త‌ను వేసిన పిల్‌ ను రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ‌కు స్వీక‌రించింద‌ని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. అంబేడ్కర్ నగర్ మురికివాడ‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించదలిచిన అమర వీరుల స్థూపంపై ప్రచారం చేస్తున్నారని కానీ వాస్త‌వాలు వేరుగా ఉన్న‌యాన్నారు. హుస్సేన్ సాగర్ ను అనుకుని ఉన్న లుంబిని పార్క్ స్థలంలో అండర్ గ్రౌండ్లో రెండు అంతస్థుల పార్కింగ్, పైన 7 అంతస్తులు ఎలా నిర్మిస్తారని శ‌శిధ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. సుప్రీం కోర్ట్ అనుమతి లేకుండా ఈ భారీ నిర్మాణం ఎలా సాధ్య‌మ‌ని ఆయ‌న నిల‌దీశారు. సీఎం ఆలోచన విధానం చిత్రంగా ఉంద‌న్నారు. ఎదో పిచ్చి లేకపోతే ఇలాంటి ఆలోచనలు రావని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ ఎక్కువ కాలం సీట్లో కొనసాగరని ఈ విష‌యం గుర్తుంచుకోవాల‌న్నారు.