Begin typing your search above and press return to search.

అబ్బే....ముందస్తు లేదు

By:  Tupaki Desk   |   31 Aug 2018 4:54 PM GMT
అబ్బే....ముందస్తు లేదు
X
ముందస్తు ఎన్నికలకు సిద్దంకండి అంటూ కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో అన్నీ పార్టీలు కూడా మానసికంగా ఎన్నికలకు సిద్దపడుతున్నాయి. ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబరులో ఎన్నికలు ఉండే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. ముందస్తు ఎన్నికల ద్రుష్ట్యా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందని పలువురు అనుకుంటున్నారు. అయితే నాయకులు ఈ ముందస్తుపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి మరోలా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి శాసనసభను రద్దు చేసినా ఎన్నికలు జరిగే అవకాశం లేదని శశిధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం ముందస్తు ఎన్నికలకు ఆమోదం తెలిపే అవకాశాలు లేవని శశిధర్ రెడ్డి అన్నారు.

ఎన్నికల ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓ.పీ. రావత్‌ తో మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం నాడు సమావేశం అయ్యారు. సమావేశ అనంతరం ఆయన ఈ విధంగా స్పందించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వాహణకు అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. మండలాల విలీనం సమస్య ఇంకా పూర్తి కాలేదని, ఈ అంశానికి సంబంధించి ఎన్నికల కమిషన్‌ దగ్గర సరైన స్పష్టత లేదని, అలాంటప్పుడు ముందస్తుకు ఎలా వెళతారని ఆయన ప్రశ్నించారు. ముందస్తుకు వెళ్లాలంటే వీవీ ప్యాట్ మిషిన్ల నిర్వాహణకు ఎన్నికల సిబ్బంది శిక్షణ తీసుకోవాలని, ఆ శిక్షణ పూర్తి కాకుండా ముందస్తు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని శశిధర్‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో సరిహద్దులోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసారని, దీంతో తెలంగాణ ఎన్నికల స్వరూపమే మారిందని ఆయన చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హోంశాఖ ఉత్తర్వులు సరిపోవని, పార్లమేంటులో రాజ్యంగ సవరణ చేయాల్సిందేనని అన్నారు. దీనికి ఆర్టికల్ 170 ద్వారా మాత్రమే పరిష్కారం దొరుకుతుందని శశిధర్ రెడ్డి వివరించారు. ఇక ఓటర్ల పాత జాబితాలో అనేక అక్రమాలు జరిగాయని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ తప్పును కప్పిపుచ్చుకుందుకే తెలంగాణ ముఖ్యమంత్రి ముందస్తుకు వెడదామనుకుంటున్నారని ఆయన విమర్శించారు.