Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు చెమటలు పట్టేలా కాంగ్రెస్ నేత కంప్లైంట్

By:  Tupaki Desk   |   17 Oct 2019 11:27 AM IST
కేసీఆర్ కు చెమటలు పట్టేలా కాంగ్రెస్ నేత కంప్లైంట్
X
ఏమైనా చేయండి. ఎలా అయినా ఫర్లేదు.. అంతిమంగా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ జెండా విజయగర్వంతో ఎగరాలన్నదే కేసీఆర్ ఆశయంగా చెబుతున్నారు. ఇందుకోసం ఆయన తన సర్వశక్తుల్ని ఒడ్డుతున్నారు. మీడియాలో వస్తున్న వార్తలకు భిన్నంగా గ్రౌండ్ లో పనులు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కుల సంఘాల సమావేశాలు.. లోగుట్టుగా చిన్న చిన్న ఆత్మీయ సమావేశాలతో పాటు.. ఎవరికి వారుగా.. వారికిఅవసరమైన హామీల్ని ఇచ్చేస్తూ గెలుపు తమ ఖాతాలో పడాలన్న పట్టుదలతో టీఆర్ ఎస్ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. టీఆర్ ఎస్ నేతల ఎన్నికల ఖర్చుపై కంప్లైంట్ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇప్పుడు కొత్త సంచలనంగా మారారు. లేఖాస్త్రాల్ని సంధించటంలో శశిధర్ రెడ్డికి ఉన్న నైపుణ్యం అంతా ఇంతా కాదు. పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా ఆయన చేసే ఫిర్యాదులు ఉండటమే కాదు.. చర్యలు తీసుకోవటానికి వీలు కల్పించేలా ఆయన కంప్లైంట్ కాపీని తయారు చేస్తారంటారు.

తాజాగా సీఎం కేసీఆర్ కు చెమటలు పట్టే అంశాన్ని శశిధర్ రెడ్డి తెర మీదకు తెచ్చారు. అదేమంటే.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఖర్చును అభ్యర్థి ప్రచార ఖర్చు కిందనే పరిగణించాలన్నది ఆయన డిమాండ్. అంతేకాదు.. కేసీఆర్ కుటుంబానికి చెందిన మీడియాలో టీఆర్ ఎస్ అభ్యర్థి ప్రకటనలు పెద్ద ఎత్తున వస్తున్నాయని.. వాటిని కూడా ఎన్నికల ఖర్చులో లెక్కవేయాలని ఆయన కోరుతున్నారు.

దీనికి తగ్గట్లే ఇప్పటికే ఎన్నిక సంఘం అధికారి రజత్ కుమార్ ను కలిసిన మర్రిశశిధర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. ఒకవేళ ఆయన ఫిర్యాదు ప్రకారం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ ఖర్చును టీఆర్ ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఖాతా కిందకు చూస్తే.. ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇదొక్కటే కాకున్నా.. మర్రి పేర్కొన్న కంప్లైంట్లను సీరియస్ గా తీసుకొని లోతుగా విచారించినా.. సారుకు చిరాకు తప్పదన్న మాట బలంగా వినిపిస్తోంది.