Begin typing your search above and press return to search.

త‌ల‌సానిపై గ‌రంగ‌రం.. స్పీక‌ర్ భేటీతో కూల్ కూల్‌

By:  Tupaki Desk   |   31 July 2015 9:14 AM GMT
త‌ల‌సానిపై గ‌రంగ‌రం.. స్పీక‌ర్ భేటీతో కూల్ కూల్‌
X
ఈ మ‌ధ్య‌న తెలంగాణ రాజ‌కీయాల్లో ఒక ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంటోంది. త‌న వ‌ద్ద‌కు విప‌రీత‌మైన ఆగ్ర‌హంతో వ‌స్తున్న నేత‌ల్ని కూల్ చేసి పంపుతున్న‌స్పీక‌ర్ వైఖ‌రి ఆస‌క్తిక‌రంగా ఉంది. వ‌రుస‌గా చోటు చేసుకున్న ప‌రిణామాల్ని స్పీక‌ర్ హ్యాండిల్ చేస్తున్న తీరు ప‌లువుర్ని ఆక‌ర్షిస్తోంది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచి..అధికార‌ప‌క్షంలోకి జంప్ అయి.. మంత్రిగా అయిన త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తీరుపై విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ‌టం తెలిసిందే. త‌ల‌సాని రాజీనామాను స్పీక‌ర్ త‌న వ‌ద్ద‌నే ఉంచుకున్నార‌ని.. దాన్ని వెంట‌నే ఆమోదించాలంటూ విప‌క్షాలు త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి వ‌ద్ద‌కు వెళ్తున్న విప‌క్ష నేత‌ల విష‌యం కాస్తంత ఆస‌క్తిక‌రంగా మారింది. మొన్నామ‌ధ్య తెలంగాణ తెలుగుదేశం నేత‌లు స్పీక‌ర్ వ‌ద్ద‌కు త‌ల‌సాని ఇష్యూ మీద ధ‌ర్నా చేసి మ‌రీ.. ఆయ‌న్ని క‌లిశారు.

స్పీక‌ర్‌ను క‌లిసేందుకు వెళ్లే స‌మ‌యంలో గ‌రంగ‌రంగా క‌నిపించిన వారు.. స్పీక‌ర్ ను క‌లిసి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం కూల్ గా క‌నిపిస్తూ.. త‌ల‌సాని విష‌యంలో రెండు రోజుల్లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స్పీక‌ర్ త‌మ‌తో చెప్పిన‌ట్లుగా టీటీడీపీ నేత‌లు వెల్ల‌డించారు. అంతేకాదు.. స్పీక‌ర్ స్పంద‌న త‌మ‌కు సంతృప్తిక‌రంగా ఉంద‌ని కాంప్లిమెంట్ ఇచ్చారు. త‌మ్ముళ్లు చెప్పిన రెండు రోజులు గ‌డిచి చాలానే రోజులు జ‌రిగిపోయాయి. కానీ..స్పీక‌ర్ నుంచి ఎలాంటి నిర్ణ‌యం రాలేదు. తెలుగుదేశం నేత‌ల నుంచి ఎలాంటి మాటా లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి స్పీక‌ర్‌తో భేటీ అయ్యారు. మంత్రి త‌ల‌సాని ఎమ్మెల్యే రాజీనామాను ఎందుకు ఆమోదించ‌రన్న విష‌యాన్ని ప్ర‌శ్నిస్తాన‌ని చెప్పిన ఆయ‌న‌.. స్పీక‌ర్ తో మాట్లాడి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మాత్రం కాస్తంత కూల్ గా క‌నిపించారు.

త‌ల‌సాని రాజీనామాపై నిర్ణ‌యం తీసుకునే విష‌యంలో స్పీక‌ర్ సానుకూలంగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. రాజీనామాను పెండింగ్‌లో పెట్ట‌టం రాజ్యాంగ విరుద్ధ‌మ‌న్న మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి.. స్పీక‌ర్ మాత్రం రాజీనామా విష‌యంలో సానుకూలంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. గ‌రంగ‌రంగా వెళ్లి క‌లుస్తున్న నేత‌లు.. స్పీక‌ర్ తో భేటీ అయ్యాక మాత్రం కూల్ కూల్ కావ‌టం కాస్తంత ఆస‌క్తిక‌రం. అలా ఎలా సాధ్యం అవుతోంది..?