Begin typing your search above and press return to search.

నాకు ఆప్ష‌న్స్ ఉన్నాయి..కాంగ్రెస్‌ కు సీనియ‌ర్ వార్నింగ్‌

By:  Tupaki Desk   |   17 Nov 2018 8:37 AM GMT
నాకు ఆప్ష‌న్స్ ఉన్నాయి..కాంగ్రెస్‌ కు సీనియ‌ర్ వార్నింగ్‌
X
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు భ‌గ్గుమంటున్నాయి. తొలి రెండు జాబితాల్లో 75 మంది అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ - తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. ఈసారి 13 మంది పేర్లను ప్రకటించింది. సస్పెన్స్‌ నెలకొన్న జనగామ సీటు ఫైనల్‌ గా పొన్నాల లక్ష్మయ్యకు దక్కింది. అయితే, ఇందులో సీనియ‌ర్‌ కు చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో వారు భ‌గ్గుమంటున్నారు. సనత్‌ నగర్‌ సీటును టీడీపీకి కేటాయించడంతో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా వార్నింగ్ ఇస్తూ త‌న‌కు ఆప్ష‌న్స్ ఉన్నాయ‌న్నారు.

మూడో జాబితా వెలువ‌డిన అనంత‌రం కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహాకూటమి పొత్తుల్లో భాగంగా సనత్‌ నగర్‌ సీటును టీడీపీకి కేటాయించడంతో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సీటు టీడీపీకి కేటాయించడం బాధాకరమని అన్నారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్న మర్రి.. నియోజకవర్గంలో తన కమిట్‌ మెంట్స్‌ తనకున్నాయని చెప్పారు. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా ఓట్ల విష‌యంలో కీల‌కంగా గ‌ళం విప్పిన మ‌ర్రికే టికెట్ ఖ‌రారు కాక‌పోవ‌డం ఆ పార్టీలోని ప‌రిస్థితి నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా....సనత్‌ నగర్ నుంచి పోటీ చేసేందుకు తనకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలకు మర్రి శశిధర్‌ రెడ్డి విజ్ఞప్తులు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కనీసం మూడో జాబితాలోనైనా సనత్‌ నగర్ స్థానాన్ని కాంగ్రెస్‌ కు కేటాయిస్తారనుకుంటే అది జరగలేదు. కాంగ్రెస్ మూడో జాబితా విడుదలైన కాసేపటికే సనత్‌ నగర్ నుంచి కూన వెంకటేష్ గౌడ్ పోటీ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. చంద్రబాబు సూచన మేరకే మర్రి శశిధర్‌ రెడ్డికి సీటు దక్కలేదని ఆయన అనుచరులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. చంద్రబాబు చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిందని నిప్పులు చెరుగుతున్నారు.