Begin typing your search above and press return to search.

'వరద' వాళ్ల పెళ్లిని ఆపలేకపోయింది

By:  Tupaki Desk   |   10 Dec 2015 6:31 PM GMT
వరద వాళ్ల పెళ్లిని ఆపలేకపోయింది
X
చెన్నై మహానగరాన్ని వరదలు ముంచెత్తిన వేళ.. ఒక ఫోటో సోషల్ మీడియాలో.. మీడియాలోనూ విస్తృతంగా వైరల్ అయ్యింది. ఓపక్క చెన్నై మహానగర దుస్థితిని కళ్లకు కట్టినట్లుగా చెబుతూనే.. ఇలాంటి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకున్న వారి పట్టుదల పలువుర్ని ఆకర్షించింది.

పెళ్లి కోసం అందంగా డెకరేట్ చేసిన వేదిక.. దాని కింద పాదాలు మొతాన్ని వర్షపు నీరు కల్యాణ మండటంలోకి వచ్చినా.. పెళ్లి కూతురు.. కుమారుడు మాత్రం అలాంటి విపత్తులోనూ తమ వివాహవేడుకను వాయిదా వేసుకోకుండా పూర్తి చేసుకున్నారు. వీరి స్ఫూర్తిని చూసి లేని హుషారును తెచ్చుకొని మరీ అతిధులు వచ్చి.. ఈ యువజంటను కలకాలం చల్లగా ఉండాలని ఆశ్వీర్వదించారు. మరికొందరు అయితే.. వరద కూడా వీరి పెళ్లిని ఆపలేకపోయిందన్న వ్యాఖ్యలు చేసుకున్నారు.

నిజానికి.. చిన్న చిన్న కారణాలకే పెళ్లిళ్లు ఆపేసుకునే ఈ రోజుల్లో.. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకున్నట్లే పెళ్లి జరగాలన్న పట్టుదలను ప్రదర్శించిన ఈ యువ జంట స్ఫూర్తి పలువుర్ని ఆకట్టుకునేలా చేసింది. ఈ సందర్భంగా వరద పేరు మీద ఆగిపోయిన పెళ్లిళ్లను ప్రస్తావించాల్సిందే. వ్యక్తిపూజకు పరాకాష్ఠంగా ఉండే తమిళనాడులో.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. చాలానే పెళ్లిళ్లు ఆగిపోయాయి.

అలా క్యాన్సిల్ అయిన పెళ్లిళ్లకు చాలానే కారణాలు ఉండొచ్చు. కానీ.. తమిళనాడు ముఖ్యమంత్రిజయలలిత పెళ్లికి రాలేకపోతారని ఎనిమిది పెళ్లిళ్లు ఆగిపోవటం విశేషం. అలా ఆగిపోయిన పెళ్లిలో తమిళనాడు రాష్ట్ర టూరిజం శాఖామంత్రి షణ్ముగనాథం కూమార్తె పెళ్లి కూడా ఉంది. గతంలోనే ఆమె వివాహం చేయాల్సి ఉన్నా.. జయలలిత జైల్లో ఉన్న సమయంలో బాగోదన్న ఉద్దేశంతో వాయిదా వేశారు.

తాజాగా.. అంతా సర్దుకోవటంతో డిసెంబరు 6న పెళ్లి ఫిక్స్ చేశారు. కానీ.. భారీ వర్షాలు.. వరదల కారణంగా.. చెన్నై మహానగరం అతలాకుతలం కావటం.. ముఖ్యమంత్రి జయలలిత వచ్చే పరిస్థితి లేకపోవటంతో.. అమ్మ రాని పెళ్లి ఒక పెళ్లేనా అని అనుకున్న మంత్రివర్యులు తన కుమార్తె పెళ్లిని వాయిదా వేశారు. ఇలా అమ్మ మీద అభిమానం ఉన్న మరో ఏడు పెళ్లిళ్లు కూడా ఇలానే ఆపేశారంట. అమ్మ రావటం లేదని పెళ్లిళ్లు వాయిదా వేసుకునే చిత్రమైన అభిమానం తమిళనాడులో మాత్రమే కనిపిస్తుందేమో..?