Begin typing your search above and press return to search.

ఉద్యోగాలు చేసే అమ్మాయిల లెక్క వింటే షాకే

By:  Tupaki Desk   |   21 Dec 2016 11:00 PM IST
ఉద్యోగాలు చేసే అమ్మాయిల లెక్క వింటే షాకే
X
దేశంలో పెళ్లి కాని అమ్మాయిల కంటే పెళ్లయిన వారే అధికంగా ఉద్యోగాలు చేస్తున్నారట‌! ఈ విషయం ఇటీవలే విడుదల చేసిన 2011 జనాభా లెక్కల ప్ర‌కారం చేసిన విశ్లేష‌ణ‌ ఆధారంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి కాని అమ్మాయిలను ఉద్యోగాలకు పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేయడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మరో కారణం ఏమిటంటే, పెళ్లి కాని అమ్మాయిలు ఇంకా తమ చదువుల్లోనే బిజీగా ఉండడమే. అంతేకాదు పెళ్లైన వారిలో త‌మ సంతానం ప‌ట్ల ఒకింత క్లారిటీతో ఉన్నార‌ని చెప్తున్నారు.

దేశంలో పెళ్లయిన వాళ్లలో మాత్రం 41 శాతం మంది ఆడవారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక పెళ్లికాని వారిలో 21 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారని తెలిసింది. ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్లు తమకు పిల్లలు తక్కువ మంది ఉండాలనే భావిస్తున్నారట. తమకు కనీసం ఒక కొడుకు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారట. దేశంలో లింగ నిష్పత్తి పడిపోవడానికి ఈ అంశం కూడా కారణంగా నిలుస్తోంది. ఉద్యోగాలు చేయని మహిళలు ఇంటి పనికి మాత్రమే పరిమితం అయి - ఇంటిలోనే జీవితాన్ని గడిపేస్తున్నారని తేలింది. ఉద్యోగాలు చేసే మహిళల కంటే వీరు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని తెలిసింది. పదేళ్ల క్రితం ఉద్యోగాలు చేస్తున్న వారిలో పిల్లలను కనగల వయసులో ఒక్కో మహిళకు సగటున 3.3 మంది పిల్లలు పుట్టేవారని, అయితే, ఇప్పుడు అది తగ్గిపోయిందని, ఇప్పుడు అది 2.9గా ఉందని లెక్కల్లో తేలింది. ఇక ఉద్యోగాలు చేయని ఆడవారిలో ఈ సగటు 3.1గానే నమోదైంది. ఉద్యోగాలు చేసే మహిళలు, చేయని మహిళలను పోల్చి చూస్తే 2001లో ఉద్యోగాలు చేసే మహిళలకు పుట్టే ప్రతి వెయ్యి మంది బాలురకు 912 మంది బాలికలు ఉన్నారని. అయితే ఇప్పుడు అది 901కి తగ్గిపోయిందని లెక్కల ప్రకారం తెలిసింది. ఇక ఉద్యోగాలు చేయని వారికి పుట్టే ప్రతి వెయ్యి మంది బాలురకు 2001లో 901 మంది బాలికలు ఉంటే, ఇప్పుడు అది 894కి తగ్గింది. తమ గర్భంలో ఆడశిశువు పడిందని తెలుసుకుని ఆర్థిక కారణాలతో మహిళలు అబార్షన్లు చేయించుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/