Begin typing your search above and press return to search.

మమత బెనర్జీతో 'సోషలిజం'కు పెళ్లి.. !

By:  Tupaki Desk   |   11 Jun 2021 11:30 AM GMT
మమత బెనర్జీతో సోషలిజంకు పెళ్లి.. !
X
మమత బెనర్జీని సోషలిజం పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది నిజంగానే నిజం.. అబద్ధం అనిపించే అతిపెద్ద నిజం. చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పు లేదు. ఎందుకంటే.. వారిద్దరూ మనుషులే. తమిళనాడుకు చెందిన ఆ జంట పెళ్లి వెనక, వారి పేర్ల వెనక ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం , మోహన్ .. సీపీఐ సేలం జిల్లా కార్యదర్శి. కమ్యూనిస్ట్ పార్టీతో 70 ఏళ్ల అనుబంధం ఉంది ఆయనకు. తాతముత్తాతల నుంచి దాన్నే వారసత్వంగా తీసుకుంటూ వస్తున్నారు. తనకు పుట్టబోయే పిల్లలకూ దానినే వారసత్వంగా ఇవ్వాలనుకున్నారు. పెద్ద కుమారుడికి కమ్యూనిజం అని పేరు పెట్టారు.

1990ల్లో సోవియట్ యూనియన్ విడిపోవడం, కమ్యూనిజం చచ్చిపోతుందని చాలా మంది వ్యాఖ్యానించడంతో.. దానిని ఎలాగైనా బతికించుకోవాలన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టుకున్నారట. ఇక, రెండో కుమారుడి పేరు, లెనినిజం. లెనిన్ మీద అభిమానంతో ఆ పేరు పెట్టారట. ఇక, మూడో కుమారుడి పేరే సోషలిజం. కమ్యూనిజంతోనే సోషలిజం వస్తుందన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టారట. కూతురు పుడితే మార్క్సియా అని పెట్టుకోవాలనుకున్నా కుదర్లేదు. తన మనవడి కి మార్క్సిజం అని నామకరణం చేశాడు. ప్రపంచానికి ఈ పేర్లు కొత్తే అయినా, తమకు మాత్రం ఆ పేర్లన్నీ పాతవేనంటున్నారు మోహన్. తమ ప్రాంతంలోని వారికి మాస్కో, రష్యా, వియత్నాం, చెకోస్లొవేకియా వంటి పేర్లున్నాయని చెప్పారు. మమత బెనర్జీ విషయానికొస్తే ఆమె కుటుంబ సభ్యులు మోహన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన బంధువులు. మమత తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీ అనుకూలురు. ఒకప్పుడు కాంగ్రెస్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చాలా దగ్గరగా ఉన్నారు. దీంతో అప్పట్లో ఆమెను ఆరాధించిన పెళ్లి కూతురు తల్లిదండ్రులు, తమ బిడ్డకు మమత బెనర్జీ పేరును పెట్టారు. రెండు కుటుంబాలకు బంధుత్వం ఉండడంతో ఇప్పుడు మూడు ముళ్లబంధంతో మరింత దగ్గరవుతున్నాయన్నమాట. జూన్ 13న సేలంలోనే వారి పెళ్లి జరగనుంది.